పొక్లెయిన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి బలి
నిడమర్రు: పొక్లెయిన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒడిసా యువకుడు మృతిచెందిన ఘటన శనివారం నిడమర్రులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం నిడమర్రు నుంచి కొల్లేరు వెళ్లే మార్గంలో చేర్చి ఉన్న పొలాలను చేపల చెరువులుగా మార్చేందుకు పొక్లెయిన్‌తో తవ్వుతున్నారు. గ్రామానికి చెందిన రైతు కొమ్ముల యేసు చెందిన చెరువు గట్టు పనులు పూర్తి చేసుకుని కన్నాజీ ఆదినారాయణ చెరువు తవ్వేందుకు పొక్లెయిన్‌ను తీసుకువెళుతున్నారు. ఈ సమయంలో పొక్లెయిన్ డ్రైవర్ గుగ్గిన వీరబాబు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగిస్తున్న సమయంలో పొక్లెయిన్ సహాయకుడు వికాస్ మాలిక్, రైతు కన్నాజీ ఆదినారాయణపై చెట్టు కొమ్మ పడింది. దీంతో వికాస్ మాలిక్ (21) అక్కడిక్కడే మృతి చెందగా ఆదినారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ఎస్ఐ ఎ.వీరబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. డ్రైవర్ వీరబాబుది తూర్పుగోదావరి జిల్లా గోకవరం అన్నారు.