అన్నే చిన్ని కవితకు రూ. 1.49 కోట్లు
అన్నే ఫ్రాంక్... పేరు వినగానే రెండో ప్రపంచం యుద్ధంలో హిట్లర్ సాగించిన దమనకాండ గుర్తొస్తుంది. నాజీ సైన్యం నడిపిన కాన్సంట్రేషన్ క్యాంపుల్లోని దారుణదృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి. ఆ గతించిన గతంలో ఓ మిగిలిపోయిన జ్ఞాపకం.. ఓ చిన్న కవిత. ఆ కవిత కింద అన్నే ఫ్రాంక్ సంతకం.
ఆమె సంతకం చేసిన ఆ కవిత కాగితాన్ని నెదర్లాండ్స్‌లోని హార్లెమ్ నగరంలో వేలం వేయగా ఓ ఆసామి 1.49 కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు. ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా కొనుక్కున్న ఆ ఆసామి వివరాలను వేలంశాల అధికారులు వెల్లడించలేదు. ఆ కవితను అమ్మకానికి పెట్టింది మాత్రం అన్నే ఫ్రాంక్ చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ జాక్వెలిన్ వాన్ మార్సన్. నెదర్లాండ్స్‌ను దురాక్రమించుకున్న నాజీల కంట పడకుండా ఆమ్స్టార్డామ్లోని ఓ కెనాల్ హౌజ్‌లో రహస్యంగా తలదాచుకోవడానికి కొన్నిరోజుల ముందు అంటే... 1942, మార్చి 28వ తేదీన అన్నే ఫ్రాంక్, జాక్వెలిన్ సోదరి క్రిస్టియానాకు పంపిన కవిత అది.
ఉత్తర జర్మనీలోని బెర్జెన్-బెల్సెన్ కాన్సంట్రేషన్ క్యాంపులో ఆకలితో అలమటించి, అలమటించి యూదు బాలిక అన్నే కన్నుమూసింది. అప్పటికీ ఆమె వయస్సు 15 ఏళ్లు. ఆమె అప్పటికే రాసిన డైరీ ఇప్పటికీ ప్రసిద్ధే. ఆ బాలిక జీవితంపై 1959లో 'డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్', 1988లో 'ది ఆటిక్: హైడింగ్ ఆఫ్ అన్నే- 1995లో 'అన్నే ఫ్రాంక్ రిమెంబర్డ్' అనే హాలివుడ్ చిత్రాలు వచ్చాయి.