Pokkiri Raja
-
వివాదంలో హన్సిక
దర్శక నిర్మాతల నటిగా పేరు తెచ్చుకున్న హన్సిక వివాదాలకు దూరంగా ఉంటారంటారు. అలాంటిది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక వివాదంలో చిక్కుకున్నారు. హన్సికకు ఇటీవల కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇటీవల తను నటించిన పులి, పోకిరిరాజా చిత్రాలు వరుసగా అపజయాల పాలవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం హన్సిక జయంరవికి జంటగా బోగన్ అనే ఒక్క చిత్రం మాత్రమే చేస్తున్నారు. పోకిరిరాజా చిత్ర నిర్మాత ఈమె మీద కేసు వేయడానికి సిద్ధం అవుతున్నారు. వివరాల్లోకెళితే బందా పరమశివం, ఒంబదుల గురు చిత్రాల దర్శక నిర్మాత, పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన పీటీ.సెల్లకుమార్ ఆ మధ్య జీవా, హన్సిక జంటగా పోకిరిరాజా అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోవైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి హన్సిక పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె ఆ కార్యక్రమానికి హాజరవలేదు. దీంతో నిర్మాత పీటీ.సెల్వకుమార్ హన్సిక కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించమని ఆమెను అడిగారు. నిర్మాత మండలిలోనూ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ హన్సిక ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో నిర్మాత ఆమెపై కేసు పెట్టడానికి సిద్ధం అయ్యారు. దీని గురించి పీటీ.సెల్లకుమార్ తెలుపుతూ పోకిరిరాజా చిత్రంలో నటించినందుకుగానూ హన్సికకు ఒప్పందం ప్రకారం పారితోషికం పూర్తిగా చెల్లించానని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోవైలో నిర్వహించ తలపెట్టామన్నారు. అందులో హన్సిక పాల్గొనడానికి ఆమెకు అలంకార దుస్తులు, బస వసతులు, ప్రయాణ వసతుల కొరకు లక్షల్లో ఖర్చు చేశామన్నారు. అలాంటిది హన్సిక చివరి వరకూ వస్తానని చెప్పి రాలేదని ఆరోపించారు. ఈ వ్యవహారం గురించి నిర్మాత మండలి ద్వారా మాట్లాడించినా ఆమె నుంచి సరైన సమాధానం రాలేదని, డబ్బు తిరిగి చెల్లించలేదని చెప్పారు. పైగా తనను అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు. నటి హన్సికపై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
జీవా, సిబిరాజ్ల మధ్య రియల్ ఫైట్
ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు పోటీ పడడం, పోరాటానికి దిగడం అనే సన్నివేశాలను చాలా చిత్రాలలో చూస్తుంటాం.అలా పోకిరిరాజా చిత్రంలో అందగత్తె హన్సిక కోసం జీవా సిబిరాజ్ చేసిన రీల్ ఫైట్ రియల్ ఫైట్‌కు దారి తీయడం చర్చనీయాంశంగా మారింది. జీవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పోకిరిరాజా. మరో కథానాయకుడిగా సిబిరాజ్ నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కథానాయకిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు తమిళుక్కు ఎన్ ఒండై అళిక్కువమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఇది. అదే విధంగా ఇలయదళపతి విజయ్ హీరోగా పులి వంటి భారీ సాంఘిక జానపద చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలలో ఒకరైన పీటీ.సెల్వకుమార్ సమర్పణలో పీటీఎస్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీఎస్.పొన్‌సెల్వి నిర్మిస్తున్న చిత్రం పోకిరిరాజా. రాజస్థాన్ సెట్లో అందాల పాట కాగా డీ.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ఒక పాట కోసం ఇటీవల పూందమల్లి రోడ్డు సమీపంలో రాజస్థాన్‌ను తలపించే విధంగా ఒక బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందించినట్లు దర్శకుడు రామ్‌ప్రకాశ్ రాయప్ప మంగళవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీని గురించి ఆయన తెలుపుతూ జీవా, హన్సికలపై చిత్రీకరించిన ఈ పాటలో 100 మంది డాన్సర్లు, రాజస్థాన్ నుంచి రప్పించిన 100 మంది సహాయ నటులు పాల్గొనగా నృత్య దర్శకురాలు బృంద అందాలను మేళవిస్తూ డాన్స్‌ను కంపోజ్ చేశారన్నారు. బబ్లీ బబ్లీ అంటూ సాగే ఆ పాటను ఆ సెట్లో రూపొందించిన స్విమ్మింగ్పూల్లోను చితీక్రరించినట్లు తెలిపారు. తన ముందు చిత్రానికి, ఈ పోకిరిరాజా చిత్రం చాలా భిన్నంగా ఉంటుందన్నారు. పక్కా కమర్షియల్ అంశాలతో జాలీగా సాగే కథా చిత్రం పోకిరిరాజా అని చెప్పారు. ఇది జీవాకు 25వ చిత్రం కావడంతో కథ విషయంలో చాలా జాగ్రత్తలను తీసుకుని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అభిమానులతో హన్సికకు చిక్కులు
అభిమానం హద్దుల్లో ఉన్నంత వరకూ ముద్దుగానే ఉంటుంది. అది దాటితేనే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. నటి హన్సికకు అలాంటి సమస్యనే ఎదురైంది. ఆమెను అందులోంచి నటుడు జీవా, సిబిరాజ్ కాపాడారు. వివరాల్లోకెళితే జీవా,హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం పోకిరిరాజా. సిబిరాజ్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. నవ నటి మానస, మనోబాలా, చిత్రా లక్ష్మణన్,యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు ఇళయదళపతితో పులి వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన పీటీఎస్.ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత పీటీ.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. చిత్ర షూటింగ్ గత కొన్ని వారాలుగా పాండిచ్చేరిలో జరుపుకుంటోంది. అక్కడ ఎడతెరిపి లేని వానలో కూడా పోకిరిరాజా చిత్రం షూటింగ్ జరుపుకుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. అదే విధంగా చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంత ప్రజలు హన్సికను చూడడానికి ఎగబడడంతో ఆమె వారి మధ్య ఇరుక్కుపోయారు. వెంటనే నటుడు జీవా, సిబిరాజ్ హన్సికను జనాల మధ్య నుంచి అతి కష్టంగా బయటకు తీసుకొచ్చారని వివరించారు. తదుపరి షెడ్యూల్‌ను చెన్నైలో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.