అభిమానులతో హన్సికకు చిక్కులు
అభిమానం హద్దుల్లో ఉన్నంత వరకూ ముద్దుగానే ఉంటుంది. అది దాటితేనే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. నటి హన్సికకు అలాంటి సమస్యనే ఎదురైంది. ఆమెను అందులోంచి నటుడు జీవా, సిబిరాజ్ కాపాడారు. వివరాల్లోకెళితే జీవా,హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం పోకిరిరాజా. సిబిరాజ్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. నవ నటి మానస, మనోబాలా, చిత్రా లక్ష్మణన్,యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు ఇళయదళపతితో పులి వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన పీటీఎస్.ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత పీటీ.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు.
తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. చిత్ర షూటింగ్ గత కొన్ని వారాలుగా పాండిచ్చేరిలో జరుపుకుంటోంది. అక్కడ ఎడతెరిపి లేని వానలో కూడా పోకిరిరాజా చిత్రం షూటింగ్ జరుపుకుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.
అదే విధంగా చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంత ప్రజలు హన్సికను చూడడానికి ఎగబడడంతో ఆమె వారి మధ్య ఇరుక్కుపోయారు. వెంటనే నటుడు జీవా, సిబిరాజ్ హన్సికను జనాల మధ్య నుంచి అతి కష్టంగా బయటకు తీసుకొచ్చారని వివరించారు. తదుపరి షెడ్యూల్‌ను చెన్నైలో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.