చివర్లో లాభాల వెలుగు
చివరి గంటన్నరలో ఊపందుకున్న కొనుగోళ్ల కారణంగా వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు పుంజుకుని 25,908 వద్ద ముగిసింది. దీంతో వరుసగా రెండు రోజుల్లో దాదాపు 430 పాయింట్లు కూడగట్టుకుంది. ఇక నిఫ్టీ కూడా 63 పాయింట్లు ఎగసి 7,747 వద్ద నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు తొలుత సానుకూలంగా మొదలయ్యాయి. పాలసీలో భాగంగా ఆర్బీఐ రెపో రేట్లను యథాతథంగా ఉంచడంతోపాటు బ్యాంకులకు రూ. 40,000 కోట్లు అందుబాటులోకివచ్చే విధంగా ఎస్ఎల్ఆర్ను తగ్గించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
వెరసి సెన్సెక్స్ మిడ్ సెషన్లో గరిష్టంగా 25,823 పాయింట్లను తాకింది. అయితే ఆపై ఒక్కసారిగా అమ్మకాలు పెరగడంతో వెంటనే 25,562 పాయింట్ల కనిష్టానికి చేరింది. ఇది 160 పాయింట్ల నష్టంకాగా, మరోవైపు యూరప్ దేశాలలో సెంటిమెంట్ మెరుగుపడటంతో అక్కడి మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. దీంతో మళ్లీ చివర్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ హైజంప్చేసి 26,000 సమీపానికి చేరి ముగిసింది.
రియల్టీ, ఆటో జోరు
ప్రధానంగా రియల్టీ, ఆటో రంగాలు 2.5% స్థాయిలో బలపడ్డాయి. రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, యూనిటెక్, ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, అనంత్‌రాజ్, డీబీ, డీఎల్ఎఫ్ 9-2% మధ్య దూసుకెళ్లాయి.