ఏప్రిల్ 27న పాలిసెట్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్కోర్సులకు సంబంధించి 2016 ఏప్రిల్ 27న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు సాంకేతిక విద్యామండలి తేదీని నిర్ణయించింది. ఈ పరీక్ష ఫలితాలను మే 9న ప్రకటించి అనంతరం ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఇలా ఉండగా ఐసెట్ కన్వీనర్‌గా ఆంధ్రాయూనివర్సిటీ మేనేజ్మెంటు విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎం.రామ్మోహనరావును నియమించారు. లాసెట్ కన్వీనర్‌గా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారెడ్డిని నియమిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
కీలకమైన ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన వివిధ కమిటీలను ఈనెలాఖరులోగా ఏర్పాటుచేయనున్నారు. నాగార్జునవర్సిటీ వీసీగా మురళీకృష్ణ పేరు ఖరారు ఇలా ఉండగా నాగార్జునవర్సిటీ ఉపకులపతిగా ఆచార్య అయ్యంకి వెంకట మురళీకృష్ణ పేరును ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూలో రిమోట్‌సెన్సింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
నాగార్జున వర్సిటీ వీసీ ఎంపికకు సంబంధించి సెర్చికమిటీ ఇంతకు ముందు ఆచార్య ఆర్.వెంకటరావును ఎంపికచేయడం, ఆయన బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించడం తెలిసిందే. దీంతో అదే సెర్చికమిటీని మరోసారి సమావేశమై ప్రభుత్వానికి మళ్లీ నివేదికను అందించింది. ఇందులోని మురళీకృష్ణ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ ఆమోదంతో త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.