ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ మహిళలు కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమరరంగాన దూకేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అలాంటి సమర యోధుల్లో నెల్లూరుకు చెందిన పొణకా కనకమ్మ ఒకరు. ఎనిమిదేళ్లకే వివాహం. పాఠశాల గడప తొక్క కుండానే పాండిత్యాన్ని సంపాదించారు. చివరికి జైలుకు వెళ్లారు. ఎవరీ కనకమ్మ? నెల్లూరు వాసులకే కాదు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిన ధీరవనిత కనకమ్మ జీవిత విశేషాలు మీకోసం... కవయిత్రి, సామాజిక కార్యకర్త కనకమ్మ 1882 జూన్ 10న పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, రావమ్మల దంపతులకు జన్మించారు. ఎనిమిదేళ్లకే నెల్లూరు సమీపంలోని పొట్లపూడి గ్రామం భూస్వామి మేనమామ, సుబ్బ రామ రెడ్డితో బాల్య వివాహం అయింది కనకమ్మకు. దీంతో కుటుంబ కట్టుబాట్ల ప్రకారం పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ఆమెలోని ధీరత్వం వెనక్కి పోలేదు. సంఘ సేవ కోసం ఇల్లు విడిచి కనకమ్మ ఉద్యమబాటన నడిచారు. నెల్లూరు కాంగ్రెస్ కమిటీకి తొలిమహిళా అధ్యక్షురాలుగా ఎంపికైన ఘనత కనకమ్మ సొంతం. మహాత్మా గాంధీ శిష్యురాలిగా ఉప్పు 1930ల కాలంలో సత్యాగ్రహం,వందేమాతరం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో వేలూరు, నెల్లూరు జైళ్లలో ఒక ఏడాదికిపైగా జైలు జీవితాన్ని అనుభవించారు. 1913లో పోట్లపూడిలో సుజన రంజనీ సమాజ స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం శ్రీ కస్తూరిదేవి విద్యాలయం స్థాపనలో ఆమె కృషి మరువలేనిది. సాహిత్య రంగంలో కూడా కనకమ్మ ఎంతో కృషి చేశారు. వ్యాసాలు, కవితలు రచించారు. ముఖ్యంగా స్త్రీవాద కోణంలో ఆమె రచనలు సాగాయి. కొంతకాలం జమీన్ రైతు పత్రికను కూడా నడిపారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన గృహలక్ష్మి స్వర్ణకంకణం కూడా ఆమెను వరించింది.తన జీవితంలో 45 ఏళ్లు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేసిన గొప్ప మహిళ. 1963 సెప్టెంబర్ 15న కనకమ్మ కనకమ్మ అస్తమించారు. 2011లో ఆమె ఆత్మకథను తెలుగులో “కనకపుష్యరాగం” పేరుతో డా.కె.పురుషోత్తం విడుదల చేయడం గమనార్హం‘‘ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి ,తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి, జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి’’ -కనకమ్మ