‘పోర్టుబంద్’తో స్తంభించిన విశాఖపట్నం పోర్టు
సమైకాంధ్ర మద్దతుగా పోర్టులోని వివిధ సంఘాలు చేపట్టిన ‘పోర్టుబంద్’ విజయవంతమైంది. పోర్టులో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రవాణా, ఎగుమతి, దిగుమతుల్లో కీలకపాత్ర వహించే టిప్పర్లు, ట్రక్కులు, లారీలు, క్రేన్లు, బుల్డోజర్లు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి. బంద్ కారణంగా పోర్టు యూజర్స్‌కు సుమారు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ‘జై సమైకాంధ్ర’ నినాదాలతో పోర్టు దద్దరిల్లిపోయింది.
విశాఖపట్నం స్టీవ్ డోర్స్ అసోసియేషన్, స్టీవ్డోర్స్, కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్, స్టీంషిప్ ఏజెంట్స్, పోర్టుయూజర్స్, టిప్పర్ ఆపరేటర్స్, ట్రైలర్ ఆపరేటర్స్, ట్రక్ ఆపరేటర్స్, వేర్‌హౌస్ ఆపరేటర్స్ తదితర ఎనిమిది సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పోర్టు బంద్ జరిగింది. రవాణా వ్యవస్థతో పాటు పోర్టులోని అన్ని కార్యకలాపాలను స్తంభింపచేసి భారీ ఆందోళనలు, నిరసనలకు చేపట్టారు. సమైకాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.