Post Graduate College
-
అంతర్గత ప్రతిభకే అందలం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో మూల్యాంకన విధానం పూర్తిగా మారబోతోంది. సంప్రదాయ పద్ధతులకు ఇక స్వస్తి పలకనున్నారు. మార్కులే కొలమానం కాకుండా, విద్యార్థిలోని నిజమైన ప్రతిభను వెలికి తీసి, దాని ఆధారంగా అతని క్రెడిట్స్ నిర్ణయిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పోస్టు– గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తును ఓయూ మొదలు పెట్టింది. అధ్యాపకులకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులను కూడా ముందుగానే సమాయత్తం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఓయూ పరిధిలో పీజీ కోర్సులు చేసే దాదాపు 30 వేల మంది సరికొత్త మూల్యాంకన పరిధిలోకి వస్తారు. కొత్త మూల్యాంకన విధానంపై ఉన్నత విద్యా మండలి గత ఏడాది ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) చేత అధ్యయనం చేయించింది. ఈ సంస్థ ఇచ్చిన సిఫారసులను మండలి ఆమోదించి అమల్లోకి తెస్తోంది. ప్రతిభకు అన్నివిధాలా పరీక్ష ఇప్పటివరకూ ఏడాది మొత్తం చదివిన విద్యకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో వచ్చే మార్కులే ప్రతిభకు కొలమానాలు. కొత్త విధానంలో విద్యార్థి అంతర్గత నైపుణ్యాన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియలో బోధకులు అత్యంత కీలకంగా మారనున్నారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ ఏడాది పొడవునా అతను అనుసరించే విధానాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో అటెండెన్స్‌కు సైతం కొన్ని మార్కులుంటాయి. ప్రతి చాప్టర్లో పాఠాన్ని విద్యార్థి ఏమేర అర్థం చేసుకున్నాడో గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులకు అధ్యాపకులు కొన్ని ప్రశ్నలు వేస్తారు. సబ్జెక్టుపై పట్టు కోసం తరగతి గదిలో స్వల్పకాలిక చర్చలు నిర్వహిస్తారు. నెలవారీ పరీక్షలూ నిర్వహిస్తారు. విద్యార్థి తాను చదివే సబ్జెక్టుల్లో ఎక్కడ ప్రతిభ కలిగి ఉన్నాడు? ఎక్కడ వెనుకబడ్డాడు? అనేది గుర్తించి మార్కులు వేస్తారు. మరోవైపు అనుభవ పూర్వక విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థి థియరీ కాకుండా, ప్రాక్టికల్‌గా తన ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మెరుగైన ఫలితాలిస్తాయని పారిశ్రామిక రంగం కోరుకునే నిపుణులు తయారయ్యే వీలుందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ప్రతిభను వెలుగులోకి తేవడానికే : ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్) మూల్యాంకన విధానంలో మార్పుల వల్ల విద్యార్థి కేవలం థియరీకే పరిమితం అయ్యే అవకాశం లేదు. అతనిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత విద్య చేసినా, ఉపాధి కోసం వెతుక్కునే పరిస్థితి ఉండకూడదనే ఈ సరికొత్త విధానం అనుసరిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందుకెళ్ళాం. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అధ్యాపకులనూ సన్నద్ధం చేశాం : ప్రొఫెసర్ రవీందర్ (ఓయూ వీసీ) ఈ ఏడాది పీజీ కోర్సుల్లో కొత్త మూల్యాంకన విధానం అమలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా అధ్యాపకులను సన్నద్ధం చేశాం. క్లాసులు ప్రారంభమైనప్పట్నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది. సిసలైన ప్రతిభ వెలికి తీసే విధానం కాబట్టి విద్యార్థులకూ మేలు జరుగతుంది. -
వివక్షకు కేరాఫ్ ‘మాన్సాస్’
రాజరికాలు పోయినా... వారి సంస్థలో మాత్రం ఆ పోకడలు కొనసాగుతున్నాయి. అక్కడ వారి మాటే వేదం... వారు చెప్పిందే శాసనం. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారి బతుకు బస్టాండే. ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నా... దయనీయమైన వేతనాలే అందుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే... వారి విభాగానికి ఎసరు పెడుతున్నారు. ఉన్న ఉద్యోగం కాస్తా తీసేసి నడిరోడ్డుకు నెట్టేస్తున్నారు. దళితులకు ఎక్కడ కీలకపదవులు ఇవ్వాల్సి వస్తుందోనని వారి ఆధ్వర్యంలోని కోర్సును రద్దు చేసేస్తున్నారు. ప్రజల దృష్టిలో సేవ చేస్తున్నామని చెప్పుకోవడానికి... ప్రభుత్వానికి తమ ఆస్తులు అందనీయకుండా చేయడానికి... జయనగరం రాజులు నడుపుతున్న మాన్సాస్‌లో ఈ విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. సాక్షి , విజయనగరం : విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక విద్యాసంస్థల్లో మహారాజా పోస్టు గ్యాడ్యుయేట్ కళాశాల ఒకటి. దానిలో 14 విభాగాలు ఉన్నాయి. అందులో బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం 50 మంది వరకు ఉన్నారు. మహారాజా పోస్టు గ్రాడ్యూయేట్ కళాశాల పేరుతో 1996 జూన్ 30న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మాన్సాస్ ట్రస్ట్ శాశ్వత అనుబంధ పత్రం పొందింది. దీని ప్రకారం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం బోధన సిబ్బందికి వేతనాలు అమలు చేయాలి. అధ్యాపకేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. కానీ వాటిని ఏమాత్రం పాటించకుండా 20 ఏళ్లుగా అన్యాయం చేస్తోంది. ఎన్ని సార్లు రాతపూర్వకంగా వినతులు సమర్పించినా... మాన్సాస్ ట్రస్ట్ పట్టించుకోవడం లేదు. అధ్యాపక అర్హతతో విధులు నిర్వర్తిస్తున్న వారికి యూజీసీ నిబంధనల ప్రకారం రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభైవేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా... 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకునికి ప్రస్తుతం కేవలం రూ.25 వేల వేతనం మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేతన నిబంధనల మేరకు బోధనేతర సిబ్బందికి రూ.18 వేల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 నుంచి 10 వేల లోపు మాత్రమే ఇస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు భోగాలు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నవారికి పదోన్నతులు కల్పించాల్సి వస్తుందని... అప్పటికే తమకు నమ్మకంగా ఉండి పదవీ విరమణ చేసినవారిని ఉన్నత పదవుల్లో నిలబెట్టి రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు గౌరవ వేతనాలు ముట్టజెబుతోంది. ఓ వైపు ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారికి మరోవైపు సంస్థ భారీ వేతనాలు ఇవ్వడంపై అనేక అరోపణలు వస్తున్నా సంస్థ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించమని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్న అధ్యాపకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నచ్చితే పనిచేయండి లేకపోతే మానేయండని హెచ్చరికలిస్తూ పరోక్షంగా భయపెడుతోంది. మొండిగా పోరాడే అధ్యాపకులను ఏమీ చేయలేక వారిని వదిలించుకోవడానికి సంబంధిత విభాగాన్ని రద్దు చేసి తమ వైఖరిని చాటుకుంటోంది. సీనియారిటీ ఉన్నా.. దళితులకు దక్కని పదవులు మరోవైపు సీనియార్టీ ప్రకారం ఉన్నత పదవులు దక్కాల్సిన దళిత అధ్యాపకులకు అన్యాయం జరుగుతోంది. విద్యార్థుల డిమాండ్ ఉన్నప్పటికీ ఆ విభాగాన్ని రద్దు చేసి పదవులకు అర్హత లేకుండా చేస్తోంది. ఉదాహరణకు కళాశాల స్థాపించినప్పటి నుంచి ఉన్న హిస్టరీ విభాగంలో డాక్టర్ అంబేడ్కర్ అశోక్ అనే అధ్యాపకుడు పనిచేస్తున్నారు. పలు విద్యాధిక అర్హతలతో ఉన్న ఆయన సీనియార్టీకి కళాశాల డైరెక్టర్ పదవి ఇవ్వాలి. ఆయన తన సీనియార్టీని గుర్తించి యూజీసీ వేతనం ఇవ్వాలని పలుమార్లు సంస్థను కోరారు. కానీ దళితుడైన ఆయనకు డైరెక్టర్ పదవి ఇవ్వడానికి ఇష్టం లేక చివరికి ఆయన పనిచేస్తున్న హిస్టరీ విభాగాన్ని గత ఏడాది రద్దు చేశారు. సోషల్ వర్క్ విభాగం కూడా అదేమాదిరిగా రద్దు చేశారు. నిజానికి ప్రతి ఏడాది విద్యార్థుల డిమాండ్ అధికంగా ఉన్న కోర్సుల్లో ఈ రెండూ నిలుస్తున్నా... కేవలం దళితులకు ఉన్నత పదవులు ఇవ్వడానికి ఇష్టం లేకే రద్దు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దళితునికి డైరెక్టర్ ఇవ్వాల్సి వస్తుందనే... కళాశాలలో 20 ఏళ్ల సీనియార్టీతో హిస్టరీ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు రూ.25 వేలు వేతనం దాటడం లేదు. యూజీసీ వేతనాలు అమలు చేస్తే రూ.1.5 లక్షల నెలవారీ వేతనం వస్తుంది. కొన్నేళ్లుగా వేతనాలు ఇవ్వకుండా మాన్సాస్ సంస్థ దోచుకుంటోంది. సీనియార్టీ ప్రకారం నాకు డైరెక్టర్ పదవి రావాల్సి ఉంది. దళితుడినైన నాకు ఆ పదవి ఇవ్వడానికి ఇష్టం లేక హిస్టరీ విభాగాన్ని గత ఏడాది రద్దు చేశారు. – డాక్టర్ ఎస్.అంబేడ్కర్ అశోక్, కార్యదర్శి, మాన్సాస్ పీజీకాలేజీ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్. -
సామాజిక అధ్యయనం పెరగాలి
అందుబాటులోని వనరులనే ప్రయోగాలకు వాడుకోవచ్చు.. పింగిళి కళాశాల సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం వడ్డేపల్లి : సామాజిక శాస్త్ర అధ్యయనాలు పెరగాల్సిన అవసరంతో పాటు పాఠ్యాంశాల సిలబస్ ను అభివృద్ధి చేయాల్సి ఉందని తెలంగాణ పొలిటిల్ జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. హన్మకొండ వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలో ‘సామాజిక శా స్త్రం- సమస్యలు, సవాళ్లు, పరిష్కార మార్గా లు’ అంశంపై ఏర్పాటుచేసిన రెండు రోజుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించగా, కోదండరాం ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మన చుట్టూ ఉన్న సమాజమే ఒక లేబొరేటరీ అని, జిల్లాను ఒక ప్రయోగశాలగా చేసుకుని అధ్యయనాలు చేయొచ్చని తెలి పారు. సోషల్ సెన్సైస్‌పై ఇప్పుడిప్పుడే మక్కు వ పెంచుకుంటారని, ఈ మేరకు సిలబస్‌ను వృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. అయి తే, బోధకుల సంఖ్య సరిపడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పౌరహక్కులను యూనివర్సిటీలు పట్టించుకోవడం లేదని అభిప్రాయపడిన కోదండరాం.. ఆర్థిక ఆలంబనగా నిలిచి ఇప్పుడు కనునమరుగవుతున్న చేతివృత్తులపై పరిశోధన చేయాలని సూచించారు. పరిశోధనలోనే వాస్తవాలు వెలుగు చూసి, పరిష్కారాలు లభిస్తాయని ఆయన తెలిపారు. పాలకులు పాశ్చాత్య దేశాల రాజ్యాంగ మీద అధ్యయనాలు చేశారే కానీ ఘర్షణలపై అధ్యయనాలు చేయలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండేందుకు లోతైన సామాజిక పరిశోధనలు జరగాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారు యూనివర్సిటీలకు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు వరంగల్‌లోని కేయూలో కూడా స్థానిక సమస్యల అధ్యయనాలకు చొరవ చూపాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్, మెడిసిన్ అంటూ వెళ్తే సమాజం వృద్ధి చెంద దని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సోషల్‌సైన్స్, విజ్ఞానశాస్త్రం రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సామాజి క శాస్త్రం దోహదపడుతుందన్నారు. ఈ కోణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపిందని తెలిపారు. ఐసీఎస్ఎస్ఆర్ ద్వారా కృషి సామాజిక శాస్త్ర అధ్యయనానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) ద్వారా కృషి జరుగుతోందని సంస్థ దక్షిణాది ప్రాంతీయ కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ జి.కృష్ణారెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్రంగా హైదరాబాద్‌లోని పని చేస్తున్న ఈ కేంద్రం ద్వా రా సామాజిక పరిశోధనలు చేసే వారిని సంస్థ ప్రోత్సహిస్తూ వారికి, కావాల్సిన సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వాహకులు కోదండరాం, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తో పాటు కృష్ణారెడ్డి, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ అడప సత్యనారాయణను సన్మానించారు. అనంతరం అధ్యాపకుడు వేణు ఆర్థిక సహకారంతో కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సరస్వతిదేవి విగ్రహాన్ని ఎమ్మె ల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో కన్వీనర్ ఆర్.కవిత, ఆర్గనైజర్ విజయలక్ష్మితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు.