టెక్స్టైల్ ప్రోమోకు ఆదరణ
ఇప్పటి వరకు 5,530 మంది వీక్షణ
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ప్రోమోకు మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించిన ఈ ప్రోమోను ఇప్పటి వరకు 5,530 మంది వీక్షించారు. జిల్లాలోని గీసుకొండ, సంగెం మండ లాల పరిధిలోని 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పార్కు ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టెలా దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివి కలిగిన వీడియోను జూలై1న విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ, చేనేత జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ఈ ప్రోమోను ట్వీటర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్. ప్రతి ఏటా రాష్ట్రం నుంచి 50 లక్షల పత్తి బేళ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నారు.