పోస్ట్ పెయిడ్ తోపాటు ప్రీపెయిడ్
ఎయిర్టెల్ కార్పొరేట్ కస్టమర్లకు ప్రత్యేకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు తమ సంస్థ కల్పించిన సౌకర్యం మేరకే మొబైల్ వాడకం ఉంటుంది. అంటే ఉద్యోగి స్థాయినిబట్టి నిర్దేశిత మొబైల్ బిల్లును కంపెనీ భరిస్తుంది. ఆ బిల్లుకు తగ్గట్టే టెలికం కంపెనీ ఒక ప్యాకేజీ ఇస్తుంది. ఇటువంటి ఉద్యోగులు తమకు నచ్చిన ప్యాక్ ఎంచుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం మరో కనెక్షన్‌ను తీసుకుని నచ్చిన ప్యాక్ వాడుతుంటారు. ఈ సమస్యను అధిగమిస్తూ భారత టెలికం రంగంలో తొలిసారిగా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఆన్ పోస్ట్‌పెయిడ్ పేరుతో కార్పొరేట్ క్లయింట్ల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. పోస్ట్‌పెయిడ్‌తో సంబంధం లేకుండా ఇక నుంచి కస్టమర్లు తమకు నచ్చిన ప్యాక్‌ను డబ్బులు చెల్లించి వినియోగించుకోవచ్చు. ఒకే నంబరుపై అటు పోస్ట్‌పెయిడ్, ఇటు ప్రీపెయిడ్ సౌకర్యం ఈ విధానం ప్రత్యేకత.
మొబైల్ డేటా కోసం..
పరిమితి ఉన్న కారణంగా చాలా మంది కార్పొరేట్ కస్టమర్లకు మొబైల్ డేటా సౌకర్యం లేదు. దీంతో వారు మరో సిమ్‌తోపాటు కొన్ని సందర్భాల్లో మరో మొబైల్ కూడా వాడాల్సి వస్తోంది. ఎయిర్టెల్ విధానంలో పోస్ట్‌పెయిడ్ ప్యాకేజీతో సంబంధం లేకుండా నచ్చిన డేటా ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. వినియోగదార్లకు ఇది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని భారతి ఎయిర్టెల్ ఇండియా, సౌత్ ఆసియా కంజ్యూమర్ బిజినెస్ డెరైక్టర్ శ్రీనివాసన్ గోపాలన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లకు డేటా ప్యాక్‌లు రూ.99 నుంచి అందిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రత్యేక డేటా, వాయిస్, వ్యాస్ ప్యాక్‌లను పరిచయం చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్టెల్ చందాదారుల సంఖ్య 2.2 కోట్లకుపైమాటే. వీరిలో 20-23 శాతం మంది పోస్ట్‌పెయిడ్ కస్టమర్లున్నారు.