తాగుబోతు భర్తను హతమార్చిన భార్య
ధర్మవరం రూరల్: మండలంలోని పోతుకుంట కాలనీకి చెందిన చంద్రకళ తన భర్తను హత్య చేసి ఊరి బయట పూడ్చివేసి ఆదివారం రూరల్ పోలీసులు ఎదుట లొంగిపోయింది. పోలీసుల వివరాల మేరకు.. పోతుకుంటకు చెందిన నరేంద్ర(45) అనంతపురంలోని ఓ కంపెనీలో సెక్యూరిటి గార్డు ఉద్యోగం చేస్తున్నాడు. రోజు తాగివచ్చి భార్యను కొడుతుండేవాడు. గత బుధవారం రాత్రి తాగి వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. వెంటనే ఆమె ఇంటి బయట వున్న రాయితో తలపై బాధడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరితో కలసి శవాన్ని ఊరి బయట వున్న సాకిరేవు పూడ్చివేశారు. నాలుగు రోజులుగా ఎవరికి తెలియకుండా ఉన్నప్పటికి భయం వేసి పోలీసుల వద్ద లొంగిపోయింది. ఎస్ఐ యతీంద్ర, ఏఎస్ఐ నాగప్పలు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తాగివచ్చి కొడుతుండడంతో ఆమె చంపిందా? లేక అక్రమ సంబంధంతో హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.