వివాహేతర సంబంధం : ఇద్దరు సజీవ దహనం
సాక్షి, వికారాబాద్ జిల్లా : వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో శుక్రవారం జరిగిన అమానుష ఘటనలో ఇద్దరు సజీవ దహనమవగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన అంజిలమ్మ (40)తో అదే గ్రామానికి చెందిన నర్సింహులు (45) అనే వ్యక్తికి వివాహేతర సంబంధం విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో కోపోద్రిక్తుడైన నర్సింహులు అంజిలమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా పోసుకొని నిప్పంటించుకున్నాడు. అంతేకాక, అడ్డు వచ్చిన ఇద్దరు అంజిలమ్మ కుటుంబసభ్యులపై కూడా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పరిస్థితి విషమించడంతో గమనించిన గ్రామస్థులు తాండూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి హైద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటి అనంతరం అంజిలమ్మ కూడా మృతి చెందింది. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.