చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
వేరుశనగపప్పులు బూజు పట్టి, చర్మం ముడుచుకుని పోయి ఉన్నాయంటే అవి తెగుళ్ల కారణంగా విషపూరితమయ్యాయని అర్థం. ఫంగస్ సోకిన, ముడుచుకుని పోయిన వేరుశనగ పప్పులను తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషాల బారిన పడకుండా దేహాన్ని సంరక్షించే ప్రక్రియలో మొదటగా దెబ్బతినేది కాలేయం, వ్యాధినిరోధక వ్యవస్థ.బూజు పట్టిన పప్పులు లివర్ డ్యామేజ్‌కి కారణమవుతాయి. కాలేయం వాపు, మచ్చలతోపాటు పనితీరు లోపించడం, లివర్ క్యాన్సర్ వంటి అనారోగ్యాలు సంభవిస్తాయి. వీటితోపాటు తక్షణం బయటపడే అనేక ఇతర అనారోగ్యాలు, అలర్జీలు, కడుపు నొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యల్లో బ్రాంకైటిస్, ఆస్త్మాతోపాటు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, పెద్ద పేగు క్యాన్సర్లకు దారితీస్తుంది. సంవత్సరాలపాటు ఆహారంలో ఇవి కొనసాగినట్లయితే నర్వస్ సిస్టమ్ కూడా బలహీనపడుతుంది. తరచూ తలనొప్పి, దేహంలో ప్రకంపనలు, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంది. మనం ఊహించని మరో సమస్య పునరుత్పత్తి వ్యవస్థ అపసవ్యతలకు లోనుకావడం కూడా.అందుకే వేరుశనగపప్పులనాణ్యతను పరిశీలించుకున్న తర్వాత మాత్రమే వంటల్లో వాడాలి. పప్పులను కొన్న వెంటనే పేపర్ మీద పోసి బూజుపట్టిన, ముడుచుకు పోయిన పప్పులను తొలగించి మంచి పప్పులను డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. పప్పులు సేకరించి నూనె పట్టించుకునే వాళ్లు కూడా బూజు పట్టిన పప్పులను, డొల్లగా ఉన్న పప్పులను జాగ్రత్తగా ఏరి పారేసి మంచి పప్పులతో నూనె పట్టించుకోవాలి.– సుజాత స్టీఫెన్ ఆర్.డి, న్యూట్రిషనిస్ట్ఇవి చదవండి: వంధ్యత్వం కాదు.. అంధత్వం!