ppas cancellation
-
విద్యుత్ మంటలు
ముదురుతున్న పీపీఏల రద్దు వివాదం ఎక్కడి విద్యుత్ అక్కడే అంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు వాటాలు చెల్లవని ఎస్ఆర్ఎల్డీసీకి చెప్పిన ఏపీఎస్‌ఎల్‌డీసీ ఏపీజెన్కో నిర్ణయానికి ఈఆర్సీ తిరస్కృతి డిస్కంలూ ప్రతిపాదిస్తే పరిశీలిస్తామని స్పష్టీకరణ ఈఆర్సీ ఆమోదం అక్కర్లేదంటున్న ఏపీ వర్గాలు ముందస్తుగా హైకోర్టులో ఏపీజెన్కో కేవియట్ దాఖలు రద్దు నిర్ణయంపై వెంటనే స్టే రాకుండా వ్యూహం 23న హైకోర్టుకు వెళ్లే యోచనలో టీ విద్యుత్ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకుంటామన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) రద్దు వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అగ్గిరాజుకుంటోంది. తాజాగా చోటుచేసుకున్న అనేక పరిణామాలతో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు చివరకు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. ప్రస్తుతమున్న కోటా మేరకే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలన్న దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎల్డీసీ) ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) గురువారం తెగేసి చెప్పింది. తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీజెన్కో పంపిన పీపీఏల రద్దు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తిరస్కరించింది. జెన్కోతో పాటు నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కూడా పీపీఏలు కుదుర్చుకున్నందున ఇరు పక్షాలూ రద్దు ప్రతిపాదనలు ఇవ్వాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీజెన్కో చీఫ్ ఇంజనీర్‌కు గురువారం లేఖ రాసింది. అయితే, పీపీఏల రద్దుపై ఈఆర్సీ నిర్ణయం ప్రభావం చూపదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీపీఏలకు ఈఆర్సీ అధికారికంగా అనుమతి ఇవ్వనందున వాటి రద్దు విషయంలో ఆ సంస్థ ఆమోదం అవసరం లేదని ఏపీ ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఏపీజెన్కో నిర్ణయం తమకు సమ్మతం కాదని, దీన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణకు చెందిన డిస్కంలు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్(గతంలో సీపీడీసీఎల్)లు తాజాగా లేఖ రాశాయి. అయితే ఆ నిర్ణయంలో మార్పు లేదని బదులిస్తూ ఏపీజెన్కో కూడా లేఖ రాయనున్నట్లు తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు మాత్రం పీపీఏల రద్దుకు అంగీకరించాయి. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యుత్ శాఖ వర్గాలు అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వానికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద తమ ప్లాంట్ల విద్యుత్‌ని తామే వినియోగించుకుంటామన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లవారీగా జరిగే విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని (షెడ్యూల్‌ని) ఎస్ఆర్ఎల్డీసీకి పంపడం లేదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే ఏపీజెన్కో హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడం గమనార్హం. పీపీఏల రద్దుపై కోర్టు వెంటనే స్టే ఇవ్వకుండా ఏపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మరోవైపు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేసేందుకు తెలంగాణ డిస్కంలు సిద్ధమవుతున్నాయి. ఎస్ఆర్ఎల్డీసీ ఆదేశాలు పాటించం: ఏపీఎస్‌ఎల్‌డీసీ లేఖ పీపీఏలతో సంబంధం లేకుండా రాష్ట్రాల కోటా మేరకు విద్యుత్ సరఫరా చేస్తామన్న ఎస్ఆర్ఎల్డీసీకి గురువారం ఏపీఎస్‌ఎల్‌డీసీ ఘాటుగా లేఖ రాసింది. రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న మేరకు మొత్తం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం చొప్పున విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అసలు పీపీఏలు ప్రస్తుతం అమలులోనే లేనందున తమ రాష్ర్టంలోని విద్యుత్‌ని తామే వాడుకుంటామని, ఈ విషయంలో ఎస్ఆర్ఎల్డీసీ ఆదేశాలను కూడా పాటించాల్సిన అవసరం లేదని ఏపీఎస్‌ఎల్‌డీసీ తన లేఖలో తేల్చి చెప్పింది. ‘అమల్లో ఉన్న పీపీఏలు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడేనని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం పీపీఏల కాలపరిమితి తీరిపోయి అవి అమల్లో లేని విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్లాంట్ల విద్యుత్‌ను మేమే వినియోగించుకుంటాం. ఎస్ఆర్ఎల్డీసీ ఆదేశాల ప్రకారం మేం నడుచుకోవాల్సిన అవసరం లే దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలనే పాటిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని డిస్కంలకు మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని రాష్ర్ట ప్రభుత్వం మాకు ఈ నెల 17న ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 37 ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనే ఆ రాష్ర్ట లోడ్ డిస్పాచ్ సెంటర్లు విధిగా పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ, ఉత్పత్తి సవ్యంగా సాగడానికి ఇది తప్పనిసరి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేం నడుచుకుంటాం. ఇక్కడి విద్యుత్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ని వంద శాతం ఇక్కడే ఇవ్వడం మా విధి. మేం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌కు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తాం. ఇరు రాష్ట్రాలకు విద్యుత్ కోటా నిర్ణయించేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతినిధి లేని విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. అందువల్ల ఈ కోటా నిర్ణయం అమలు సమంజసం కాదు’ అని ఏపీఎస్‌ఎల్‌డీసీ తన లేఖలో స్పష్టం చేసింది. అదేవిధంగా జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ఎస్‌ఎల్‌డీసీలు ఏర్పడిన విషయాన్నీ గుర్తుచేసింది. తమ నిర్ణయాన్ని గౌరవించి రాష్ర్టంలో విద్యుత్ సరఫరాకు, గ్రిడ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు విన్నవించింది. విద్యుత్ ఉత్పత్తి షెడ్యూల్‌కు మంగళం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎస్ఆర్ఎల్డీసీకి చెప్పాల్సిన ఆయా కేంద్రాల ఇంజనీర్లు ఈ ప్రక్రియకు తాజాగా మంగళం పాడారు. ‘తమ రాష్ట్రానికి చెందిన ప్లాంట్ల నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్న సమాచారాన్ని కేవలం ఏపీఎస్ఎల్డీసీకి మాత్రమే ఇస్తాం. తమవి అంతర్రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లు కానందున వాటి ఉత్పత్తి షెడ్యూల్‌ను మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని ఎస్ఆర్ఎల్డీసీకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్లాంట్ల చీఫ్ ఇంజనీర్లు(సీఈ)లు గురువారం స్పష్టం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే సమాచారం ఎస్ఆర్ఎల్డీసీకి చేరడం లేదు. ఫలితంగా కోటా ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా విషయంలో అస్పష్టత రావడం లేదు. మొత్తానికి గురువారం నాడు ఏపీలో ఉత్పత్తి అయిన విద్యుత్ అక్కడే వినియోగమైనట్లు తెలుస్తోంది. పీపీఏలపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకునే వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. అయితే, అమల్లోలేని పీపీఏలపై కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని ఏపీ ఇంధన శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. -
మోడీ వద్దకు పంచాయితీ!
-
మోడీ వద్దకు పంచాయితీ!
పోలవరంపై 26న కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం ముంపు మండలాలపై ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించనున్న నేతలు పీపీఏల విషయంలో ఏపీ ఏకపక్ష ధోరణిపైనా ప్రధానికి ఫిర్యాదు వాటి రద్దు నిర్ణయం విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధమని వాదన తెలంగాణకు ప్రత్యేక హోదా, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదాకు విజ్ఞప్తులు విభజన చట్టంలో పేర్కొన్న ప్రయోజనాలపైనా చర్చకు అవకాశం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపైనా కే సీఆర్ చర్చించనున్నారు. పోలవరం ముంపు మండలాలపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యుత్ కేటాయింపుల విషయంలో పీపీఏలను రద్దు చే యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై ప్రధానికి కేసీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో రాష్ట్రానికి ఉద్దేశించి పేర్కొన్న ప్రయోజనాలు, కేంద్ర సర్వీసు ఉద్యోగుల పంపిణీ, విద్యుత్ పంపిణీ, నీటి విడుదల, పన్ను మినహాయింపు తదితర విషయాలను కేంద్రం ముందుంచడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అఖిలపక్ష నేతలను వెంటబెట్టుకుని ఈ నెల 26న ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై ప్రత్యేక నివేదికలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు శాసనసభలోనూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇదే విషయాన్ని కేసీఆర్ నేతృత్వంలోని అఖిలపక్ష నేతలు మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇందుకు ప్రధాని అపాయింట్మెంట్ను కోరినట్టు సమాచారం. అలాగే పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది రాష్ర్ట విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడుతున్న కేసీఆర్ దీనిపై ప్రధానితో చర్చించాలని నిర్ణయించారు. పీపీఏల రద్దు వల్ల తెలంగాణ రాష్ర్టం సుమారు 540 మెగావాట్ల విద్యుత్నుకోల్పోవాల్సి వస్తోందని, ఇప్పటికే తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి ఈ నిర్ణయం శరాఘాతంగా మారుతుందని మోడీకి ఆయన వివరించనున్నారు. ప్రత్యేక హోదాల మాటేంటి? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లే.. తెలంగాణ కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి అఖిలపక్షం విజ్ఞప్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వివరించనుంది. అలాగే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం పారిశ్రామికంగా తీవ్రంగా నష్టపోతుందని, పన్ను మినహాయింపుల వల్ల పొరుగు రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉందని అఖిలపక్ష నేతలు తమ ఆందోళన వెలిబుచ్చనున్నారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి పన్నుల్లోనూ ప్రోత్సాహాకాలు ఇవ్వాలని, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కల్పిస్తామన్న అన్ని రకాల ప్రయోజనాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇక కేంద్ర సర్వీసుకు సంబంధించిన అధికారుల విభజన పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం 44 ఐఏఎస్, 31 మంది ఐపీఎస్, 13 మంది ఐఎఫ్ఎస్ అధికారులనే రాష్ట్రానికి కే టాయించారు. డిప్యూటేషన్‌పై ఉన్న 11 మంది అధికారులు ఈ నెలాఖరులోగా వెళ్లిపోనున్నారు. దాంతో పరిపాలన ఇబ్బందిగా మారనుంది. రాష్ర్టంలో పాలన ఇంకా గాడిలో పడకపోవడానికి అధికారుల విభజన పూర్తిగా జరగకపోవడమే ప్రధాన కారణమని మోడీకి కేసీఆర్ వివరించనున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
కోటా యథాతథం
విద్యుత్‌పై రాష్ట్ర డిస్పాచ్ సెంటర్‌కు దక్షిణాది గ్రిడ్ ఆదేశం ఇరు రాష్ట్రాలకూ ప్రస్తుత వాటా మేరకే సరఫరా పీపీఏలతో నిమిత్తం లేదంటూ గ్రిడ్ ఈడీ లేఖ కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించాకే తర్వాతి చర్యలు తెలంగాణకు తక్షణ ముప్పు తప్పినట్టే సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాను యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ)ను బెంగళూరు కేంద్రంగా ఉన్న దక్షిణాది ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) ఆదేశించింది. ఎస్ఆర్ఎల్డీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పీఆర్ రఘురాం ఎస్ఎల్డీసీకి బుధవారం ఈ మేరకు లేఖ రాశారు. పీపీఏలు అమల్లో ఉన్నా, లేకపోయినా ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు ఉన్న వాటా మేరకు విద్యుత్ సరఫరా చేయాలని అందులో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాను విభజన చట్టం మేరకు ఎస్ఆర్ఎల్డీసీ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ వాటాలను ఖరారు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను కూడా లేఖలో ఈడీ ప్రస్తావించారు. ‘‘ఇరు రాష్ట్రాల విద్యుత్ వాటాలను ఖరారు చేస్తూ విభజన అనంతరం మే 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జీవో(నంబర్ 20) జారీ చేసింది. పీపీఏలు దానికి అనుగుణంగా ఉన్నా లేకపోయినాఇరు రాష్ట్రాలకూ పేర్కొన్న వాటా మేరకు విద్యుత్‌ను సరఫరా చేయాలి. ఆ రాష్ట్రాల మధ్య ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించండి. ఆ శాఖ నిర్ణయం అనంతరమే దీనిపై ముందుకు వెళ్లాలి’’ అని అందులో ఆయన స్పష్టం చేశారు. పీపీఏల రద్దు వల్ల విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)కు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఈడీ అభిప్రాయపడ్డారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ వాటాను ఖరారు చేసేందుకు గత మార్చి 28న టాస్క్‌ఫోర్స్ కమిటీ వేశాం. అది పేర్కొన్న మేరకే ఇరు రాష్ట్రాలకు విద్యుత్ వాటాను ఖరారు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2 నుంచి ఆ వాటా మేరకే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం’’ అని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈఆర్సీ ఒకవేళ తక్షణం పీపీఏల రద్దుకు సిఫార్సు చేసినా పీపీఏల మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా యథాతథంగా కొనసాగుతుంది. కాబట్టి విద్యుత్ సరఫరా విషయంలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలంగాణ ఇంధన శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర విద్యుత్ శాఖ తీసుకునే నిర్ణయంపైనే పీపీఏల భవితవ్యం ఆధారపడి ఉందన్నాయి.