కోటా యథాతథం | cancellation of ppas temporiraly stalled | Sakshi
Sakshi News home page

కోటా యథాతథం

Published Thu, Jun 19 2014 1:14 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

కోటా యథాతథం - Sakshi

కోటా యథాతథం

విద్యుత్‌పై రాష్ట్ర డిస్పాచ్ సెంటర్‌కు దక్షిణాది గ్రిడ్ ఆదేశం
ఇరు రాష్ట్రాలకూ ప్రస్తుత వాటా మేరకే సరఫరా
పీపీఏలతో నిమిత్తం లేదంటూ గ్రిడ్ ఈడీ లేఖ
కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించాకే తర్వాతి చర్యలు
తెలంగాణకు తక్షణ ముప్పు తప్పినట్టే


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాను యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ)ను బెంగళూరు కేంద్రంగా ఉన్న దక్షిణాది ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) ఆదేశించింది. ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పీఆర్ రఘురాం ఎస్‌ఎల్‌డీసీకి బుధవారం ఈ మేరకు లేఖ రాశారు. పీపీఏలు అమల్లో ఉన్నా, లేకపోయినా ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు ఉన్న వాటా మేరకు విద్యుత్ సరఫరా చేయాలని అందులో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాను విభజన చట్టం మేరకు ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ వాటాలను ఖరారు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను కూడా లేఖలో ఈడీ ప్రస్తావించారు. ‘‘ఇరు రాష్ట్రాల విద్యుత్ వాటాలను ఖరారు చేస్తూ విభజన అనంతరం మే 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జీవో(నంబర్ 20) జారీ చేసింది. పీపీఏలు దానికి అనుగుణంగా ఉన్నా లేకపోయినాఇరు రాష్ట్రాలకూ పేర్కొన్న వాటా మేరకు విద్యుత్‌ను సరఫరా చేయాలి. ఆ రాష్ట్రాల మధ్య ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించండి. ఆ శాఖ నిర్ణయం అనంతరమే దీనిపై ముందుకు వెళ్లాలి’’ అని అందులో ఆయన స్పష్టం చేశారు. పీపీఏల రద్దు వల్ల విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)కు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఈడీ అభిప్రాయపడ్డారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ వాటాను ఖరారు చేసేందుకు గత మార్చి 28న టాస్క్‌ఫోర్స్ కమిటీ వేశాం. అది పేర్కొన్న మేరకే ఇరు రాష్ట్రాలకు విద్యుత్ వాటాను ఖరారు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2 నుంచి ఆ వాటా మేరకే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం’’ అని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈఆర్‌సీ ఒకవేళ తక్షణం పీపీఏల రద్దుకు సిఫార్సు చేసినా పీపీఏల మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా యథాతథంగా కొనసాగుతుంది. కాబట్టి విద్యుత్ సరఫరా విషయంలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలంగాణ ఇంధన శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర విద్యుత్ శాఖ తీసుకునే నిర్ణయంపైనే పీపీఏల భవితవ్యం ఆధారపడి ఉందన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement