ఉద్యోగుల విభజనపై ముందడుగు?
♦ సానుకూలంగా ఇరు రాష్ట్రాల ‘విద్యుత్’ సీఎండీల సమావేశం
♦ ఉద్యోగుల సర్వీసు రికార్డులను పంచుకోవాలని అంగీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలపై శుక్రవారం ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల సీఎండీలు విద్యుత్ సౌధలో సమావేశమై ప్రాథమిక స్థాయి చర్చలు జరిపారు. తెలంగాణ, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీలు డి.ప్రభాకర్ రావు, కె.విజయానంద్ భేటీకి సంయుక్తంగా నేతృత్వం వహించారు. గత భేటీల్లో ఇరువురూ భిన్న వాదనలు విన్పించడంతో చర్చల్లో ఏ పురోగతీ లేకుండా పోయింది.
వాటితో పోలిస్తే తాజా భేటీ సామరస్య దృ క్పథంతో జరిగిందని అధికార వర్గాలంటున్నాయి. ఉద్యోగుల విభజన ప్రక్రియ పరిపూర్తి దిశగా ఇరువురూ భేటీలో సానుకూల దృక్పథంలో వ్యవహరించారు. ప్రాథమిక స్థాయి చర్చలే జరిగాయని, ఉద్యోగులను ఏ ప్రాతిపదికన విభజించాలనే అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఓ అధికారి పేర్కొన్నారు. అయితే రెండు రాష్ట్రా లూ తమ వద్ద ఉన్న ఉద్యోగుల సర్వీసు రికార్డుల సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని ప్రధానంగా ఇరువురూ అంగీకారానికి వచ్చారు.
‘వర్క్ టూ ఆర్డర్’ ప్రాతిపదికన ఇరు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపులు జరిగాక వారి సర్వీసు రికార్డుల ఫైళ్లు కూడా రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల వద్ద చెరో సగం ఉండిపోయాయి. వాటిని పంచుకోవాలన్న నిర్ణయంతో విభజన ప్రక్రియలో ముందడుగు పడినట్టయింది. 27న మళ్లీ సమావేశమై సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. విభజనపై ఆ భేటీలో స్పష్టత రావచ్చని ఇరు రాష్ట్రాల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రిలీవ్ చేసిన 1252 మంది ఆంధ్రా స్థానికత ఉన్న ఉద్యోగుల్లో కొందరిని సాంకేతిక కారణాల రీత్య వెనక్కి తీసుకోవాల్సి వస్తే అందుకు తెలంగాణ విద్యుత్ సంస్థలు సంసిద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.