PPP method
-
బాబు నిర్వాకం.. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నాయి. ఏపీలోని ఆసుపత్రులను అన్నింటినీ పీపీపీ విధానంలోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.కాగా, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు మరో షాకిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గంలో పీపీపీ పద్దతిలో ఆసుపత్రి ఉండాలని చంద్రబాబు.. వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దూరం కానుంది. వైద్యం మెత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది.ఇక, ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్ పీపీపీ మోడల్’ను అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులను పీపీపీ పద్దతిలో పెట్టాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ ఆస్పత్రులు ప్రవేటుకు..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అనుసంధానించాలని, తద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వాటిని నిర్వహించాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ మేరకు ప్రజాభిప్రాయం కోరింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే, దానికి అనుబంధ ఆసుపత్రిని నెలకొల్పడం అత్యంత కష్టమైన వ్యవహారం. ఎంతో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా రోగులను ఆయా ప్రైవేటు బోధనాసుపత్రులకు తీసుకురావడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య నాసిరకంగా ఉంటుందన్న భావన అందరిలోనూ నెలకొంది. ఈ పరిస్థితుల నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విముక్తి కలిగించే నూతన ప్రతిపాదనను నీతి ఆయోగ్ ముందుకు తెచ్చింది. ప్రస్తుతం గుజరాత్, కర్ణాటకల్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అప్పగించిన విషయాన్ని నీతి ఆయోగ్ ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసే విషయాన్ని చర్చకు తీసుకువచ్చింది. వైద్యుల కొరతను తీర్చేందుకేనంటూ... అర్హత కలిగిన వైద్యుల కొరతను తీర్చడమే పీపీపీ పద్ధతి లక్ష్యమని నీతి ఆయోగ్ తెలిపింది. ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా 600 పడకలతో బోధనాసుపత్రి ఏర్పా టు చేయడం ఖర్చుతో కూడుకున్నది. దీంతో అనేకమంది ఔత్సాహికులు ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో మెడికల్ సీట్ల కొరత వేధిస్తుందనేది నీతి ఆయోగ్ ఉద్దేశమని వైద్య నిపుణులు అంటున్నారు. తెలంగాణలో అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అవసరంలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. -
లాహిరి లాహిరి లాహిరిలో..
కృష్ణానదిలో విహారం.. నల్లమల మధ్య పర్యాటక విడిది * కొల్లాపూర్ ఎకో టూరిజం ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా * సోమశిల-శ్రీశైలం బోటింగ్ ఏర్పాటు.. అక్కమహాదేవి గుహలకు కొత్త హంగులు * చీమల తిప్ప దీవి, శ్రీవారి సముద్రం రిజర్వాయర్ల అభివృద్ధి * రూ.350 కోట్లతో బృహత్తర ప్రాజెక్టు.. కేంద్రం నుంచి రూ.100 కోట్లు సాక్షి, హైదరాబాద్: పాపికొండలు.. ప్రకృతి రమణీయత అంతా ఒకేచోట కొలువుదీరినట్లు అనిపించే సుందర ప్రాంతం. ఇప్పుడది ఆంధ్రప్రదేశ్‌లో భాగం. అలాంటి పర్యాటక స్వర్గధామం ఇప్పుడు తెలంగాణలోనూ కనువిందు చేయనుంది. ఇందుకోసం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ కేంద్రంగా ఒక బృహత్తర ప్రాజెక్టు సిద్ధం కాబోతోంది. దాదాపు రూ.350 కోట్లతో రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తన వంతుగా రూ.100 కోట్ల వరకు ఇచ్చేందుకు ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆధ్యాత్మికం, వినోదం ప్రధానాంశాలుగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ఎకో టూరిజం ప్రాజెక్టును తీర్చిదిద్దబోతోంది. సోమవారం ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో కేంద్ర పర్యాటక శాఖ దీనికి ఆమోదం తెలిపింది. కొత్తగా ప్రారంభించిన పర్యాటక పథకం ‘స్వదేశ్ దర్శన్’ కింద నిధులు కేటాయించేందుకు సుముఖత తెలిపింది. ఏం చేస్తారు?: నల్లమలలోని సోమశిల ప్రాజెక్టు వద్ద ప్రకృతి సౌందర్యాన్ని ఒడిసిపట్టి పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా తీర్చిదిద్దబోతున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో బోటింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పర్యాటకులు విహరించొచ్చు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరువలో ఉన్న అక్క మహాదేవి గుహలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. అక్కడ లైటింగ్‌తోపాటు పర్యాటకులకు కాటేజీలను నిర్మిస్తారు. శ్రీశైలం-సోమశిల నీటిమార్గం ఏర్పాటు ఇది. ఇక సోమశిల ద్వాదశ జ్యోతిర్లింగాలయం (లలితాంబిక సోమేశ్వరాలయం), జటుప్రోలు మదనగోపాల స్వామి ఆలయం, శాతవాహనకాలంలో 20 ఆలయాల సమూహంగా రూపుదిద్దుకున్న మూక గుడులు, సింగోటం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలను ఈ ప్రాజెక్టులో చేర్చారు. కృష్ణా నది మధ్యలో ప్రశాంతంగా ఉండే చీమల తిప్ప దీవిని పర్యాటకుల విడిది కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. శ్రీవారి సముద్రం రిజర్వాయర్‌ను కూడా పర్యాటకులు సందర్శించేలా హంగులు అద్దుతారు. సురభిరాజుల బంగ్లా లాంటి చారిత్రాక కట్టడాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రధాన దేవాలయాలు, సందర్శనీయ స్థలాలు కాకుండా మరో పది విడిదులను ఈ ఎకో టూరిజం ప్రాజెక్టులో చేర్చారు. దీన్ని పీపీపీ పద్ధతిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికను మరికొద్ది రోజుల్లో రూపొందించనున్నారు.