Pradeep Rawat
-
డ్రైవర్ రాముడు టీజర్
డ్రైవర్ రాముడు ఈ పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రూపొందుతోంది. కమెడియన్ ‘షకలక’ శంకర్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు రాజ్ సత్య డ్రైవర్ రాముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా లాంఛ్ చేయించారు. ప్రదీప్‌సింగ్ రావత్‌కి శంకర్ మధ్య జరిగే సరదా డైలాగులతో టీజర్‌ను చూపించారు. సునీల్ కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. శంకర్ మార్క్ కామెడీతోపాటు ఎమోషనల్గానూ కథ ఉంటుందని మేకర్లు చెబుతున్నారు. అంచల్ సింగ్ శంకర్‌కు జోడీగా నటిస్తోంది. ఎమ్.ఎల్. రాజు, ఎస్.ఆర్. కిషన్ నిర్మిస్తున్న డ్రైవర్ రాముడు త్వరలోనే విడుదల కానుంది. -
‘షకలక’ శంకర్ డ్రైవర్ రాముడు టీజర్ విడుదల
-
గ్యాంగ్ వార్
‘మంగళ’, ‘క్రిమినల్స్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న మరో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వెపన్’. అవినాష్, ప్రదీప్ రావత్, రాజారాయ్, రాజు, మధుబాబు ప్రధాన పాత్రల్లో ఆర్.ఎస్.సురేష్ దర్శకత్వంలో శర్మ చుక్కా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ మార్చి 20న మొదలవుతుంది. శర్మ చుక్కా మాట్లాడుతూ– ‘‘రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్‌కి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చే కథాంశంతో మా సినిమా ఉంటుంది. మా బ్యానర్లో వచ్చిన ‘మంగళ, క్రిమినల్స్’ చిత్రాల కంటే ‘వెపన్’ మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సబ్బారపు ప్రకాష్. -
స్క్రీన్ టెస్ట్
► నటుడు ప్రదీప్ రావత్ ఏ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు? ఎ) ఛత్రపతి బి) అందరివాడుసి ) సై డి) భద్ర ► దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ సినిమా తీయకముందు షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించారు. ఏ షార్ట్‌ఫిల్మ్ అతనికి మంచి పేరు తెచ్చిందో తెలుసా? ఎ) సైన్మా బి) అతిథి సి) లోకల్ బోయ్ డి) రైతుబిడ్డ ► భానుమతిని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి. ఎ) కమలాకర కామేశ్వరరావు బి) సి.పుల్లయ్య సి) పి. పుల్లయ్య డి) ఆదుర్తి సుబ్బారావు ► హీరో శర్వానంద్ సినిమాల్లోకి రాకముందు ఒక యాడ్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారు. ఆ యాడ్‌లో ఓ టాప్ హీరో నటించారు. ఆ నటుడెవరో ఊహించండి? ఎ) చిరంజీవి బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) మోహన్‌లాల్ ► ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువమంది ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్నది ఈ నటుని ఖాతాలోనే.. ఆయనెవరు? ఎ) అక్షయ్ కుమార్ బి) అమితాబ్ బచ్చన్ సి) సల్మాన్‌ఖాన్ డి) ఆమిర్‌ఖాన్ ► తన ఆరేళ్ల వయసులో..ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాట పాడారు. ఇప్పుడు ఆమె హీరోయిన్ కూడా. ఎవరో కనిపెట్టారా? ఎ) ‘కలర్స్’ స్వాతి బి) శ్రుతీహాసన్ సి) అమలాపాల్ డి) మమతా మోహన్‌దాస్ ► మొట్టమొదట కలర్లో (గేవా) పూర్తి నిడివితో వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా? ఎ) లవకుశ బి) ఆరాధనసి) అ మరశిల్పి జక్కన్న డి) పాతాళ భైరవి ► పుణ్యమూర్తులఅప్పలరాజు ఈయన అసలు పేరు. తెర పేరేంటో తెలుసా? ఎ) పద్మనాభం బి) రేలంగి సి) రాజనాల డి) రాజబాబు ► ‘ 7/జి బృందావన్ కాలనీ’ కన్నడ రీమేక్‌లో నటించిన ఈ బ్యూటీ ఇప్పడు తెలుగులో స్టార్ హీరోయిన్? ఆమె ఎవరో కనుక్కోండి? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) తమన్నా సి) రాశీఖన్నా డి) రెజీనా ► దీపావళి సినిమాలో‘నరకాసురుడు’ పాత్రను పోషించిన నటుడు గుర్తున్నారా? ఎ) యస్.వి. రంగారావు బి) కాంతారావు సి) చిత్తూరు నాగయ్య డి) కొంగర జగ్గయ్య ► తన మూడవ ఏట నుండే సంగీత శిక్షణ తీసుకున్న ఈ గాయని, తరువాతి కాలంలో గొప్ప పేరు సంపాదించారు. ఈమెను ‘నైటింగేల్ ఆఫ్ సౌత్’అని కూడా అంటారు.. ఆ నైటింగేల్ ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఎ) యస్.జానకి బి) పి.సుశీలసి) జమునారాణి డి) రావు బాలసరస్వతి ► రజనీకాంత్మాతృభాష ఏది? ఎ) కన్నడ బి) మలయాళం సి) తమిళ్ డి) మరాఠీ ► సీనియర్ యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం? ఎ) యుగంధర్ బి) బొబ్బిలిపులి సి) రాముడు–భీముడు డి) కథానాయకుడు ► అలనాటి హాట్ డాన్సర్స్ జయమాలిని, జ్యోతిలక్ష్మిలకు బంధుత్వం ఉంది? వీళ్లు ఏమవుతారు? ఎ) అక్కాచెల్లెళ్లు బి) వదినా మరదలు సి) పిన్ని, కూతురు డి) తోడికోడళ్లు ► కృష్ణవంశీ–చిరంజీవి కాంబినేషన్లో అప్పట్లో ఒక సినిమా అనుకొని, దానికి పేరు కూడా పెట్టారు?ఆ సినిమా పేరేంటో తెలుసా? ఎ) జనగణమన బి) వందేమాతరం సి) స్వాతంత్య్ర భారతదేశం డి) సమరయోధుడు ► ‘మంచితనం అనేది చెప్పటానికి, వినటానికి తప్ప బతకటానికి పనిచేయదు’ అని నాగచైతన్య చెప్పిన డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎ) ఆటోనగర్ సూర్య బి) దోచెయ్ సి) దడ డి) మనం ► జయలలిత, ఎస్. వరలక్ష్మి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) వింత కుటుంబం బి) విచిత్ర కుటుంబం సి) బంగారు కుటుంబం డి) ఆదర్శకుటుంబం ► ఏ తెలుగు సినిమాలో సంజయ్‌దత్ గెస్ట్‌రోల్‌లో చేశారు? (చిన్న క్లూ– ఈ సినిమాలో నాగార్జున హీరో) ఎ) నిన్నే పెళ్లాడతా బి) రక్షకుడు సి) చంద్రలేఖ డి) హలోబ్రదర్స్ ► ఈ ఫొటోలో ఉన్న చిన్ని కృష్ణుణ్ణి గుర్తుపట్టారా? ఎ) బాలకృష్ణ బి) జూ. ఎన్టీఆర్ సి) కల్యాణ్‌రామ్ డి) హరికృష్ణ ► జూ. ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ సినిమా కెమెరామేన్ ఎవరు? ఎ) పి.సి.శ్రీరామ్ బి) కె.కె. సెంథిల్ కుమార్ సి) ఛోటా కె. నాయుడు డి) శ్యామ్ కె.నాయుడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు : 1) సి 2) ఎ 3) బి 4) ఎ 5) బి 6) బి 7) ఎ 8) డి 9) ఎ 10) ఎ 11) ఎ 12) డి 13) సి 14) ఎ 15) బి 16) బి 17) డి 18) సి 19) డి 20) బి -
రావత్... వెండితెర రావణ్!
ఉత్తమ విలన్ కొన్ని సంఘటనలు ‘చిత్రం’గా జరుగుతాయి. సూచనప్రాయంగా కూడా చెప్పకుండా జరుగుతాయి. ‘ప్రదీప్ రావత్ ఎవరు?’ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కాస్తో కూస్తో ఆలోచించవచ్చుగానీ...మన తెలుగు వాళ్లు మాత్రం టకీమని చెబుతారు. వీలైతే అతని డైలాగును ఒకసారి ఇలా గుర్తుతెచ్చుకుంటారు. ‘ఒక్క ముక్క చెప్పి ఉండాలి. చెప్పలే. అంటే...లెక్కలే! నేనంటే లెక్కలేని వాన్ని నా లెక్కలో ఉంచడం ఇష్టం లేదు’ రాజమౌళి ‘సై’ సినిమాకు ఒక విలన్ కావాలి. ఆషామాషీ విలన్ కాదు. గట్టి విలన్ కావాలి. సినిమా విజయానికి విలనే కీలకం! అందుకే రాజమౌళి విలన్ల వేటలో ఉన్నాడు. ఎందరినో... స్క్రీన్‌టెస్ట్, అడిషన్ టెస్టులు చేస్తున్నాడు. కానీ ఎవరూ నచ్చడం లేదు. దీంతో ‘నాకో మాంచి విలన్ కావాలి’ అంటూ తన అసిస్టెంట్‌ను ముంబైకి పంపించాడు. ఆ అసిస్టెంట్ ఎక్కడెక్కడ తిరిగాడోగానీ ఆరోజు అమీర్‌ఖాన్ ‘లగాన్’ సినిమా చూద్దామని డిసైడైపోయాడు. అతను అలా డిసైడై ఉండకపోతే....ప్రదీప్ రావత్ ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. మనకు ఒక ఉత్తమ విలన్ తెర మీద పరిచయమయ్యేవాడు కాదు! ‘లగాన్’ సినిమాకు కృతజ్ఞతలు. ‘లగాన్’లో దేవా అనే సర్దార్ పాత్ర పోషించాడు రావత్. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పట్టణంలోని యు.సి.ఒ. బ్యాంకులో కొంత కాలం పని చేసిన ప్రదీప్ రామ్‌సింగ్ రావత్ ‘మహాభారత్’ టీవీ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘యుగ్’ టీవీ సీరియల్లో బ్రిటీష్ ఇన్స్పెక్టర్గా, ‘సర్ఫ్రోష్’ సినిమాలో ‘సుల్తాన్’గా నటించాడు. మళ్లీ ‘లగాన్’ దగ్గరకు వద్దాం. ‘లగాన్’లో దేవా దూకుడు రాజమౌళి అసిస్టెంట్‌కు బాగా నచ్చింది. ‘నేను వెదుకుతున్న విలన్ ఇతడే’ అనుకున్నాడు. రావత్‌ను సంప్రదించాడు. సౌత్ సినిమాలలో నటించడానికి విముఖంగా లేడుగానీ తనలో చిన్న సందేహం... ‘‘నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. భాష రాకపోతే బొమ్మలా నటించాల్సిందే...’’ అయితే ఈ సందేహాన్ని పక్కన పెట్టి అడిషన్ టెస్ట్‌కు హాజరయ్యాడు. ఓకే అనిపించుకున్నాడు. అలా తెలుగు వెండితెరపై బిక్షు యాదవ్‌గా అలరించాడు. నోటిలో పెద్ద చుట్ట. ముక్కుకు రింగు. కాటుక కళ్లు. పే...ద్ద మీసాలు. నాలుక మడతెట్టి వార్నింగ్ ఇచ్చే మ్యానరిజం... చూసీ చూడగానే తెలుగు ప్రేక్షకలోకానికి చేరవయ్యాడు రావత్. ఆ తరువాత... ‘భద్ర’లో వీరయ్య, ‘అందరివాడు’లో సత్తి బిహారి, ‘ఛత్రపతి’లో రాస్ బిహారి, ‘దేశముదురు’లో తంబిదురై, ‘యోగి’లో నరసింహ పహిల్వాన్, ‘జగడం’లో మాణిక్యం... ఇలా ఎన్నో పేర్లతో ఉత్తమ విలన్‌గా స్థిరపడ్డాడు రావత్. ఇక ‘గజినీ’ సినిమాలో రావత్ చెడ్డ విలనిజానికి మంచి పేరు వచ్చింది. రామ్-లక్షణ్గా సౌత్‌లో, ధర్మాత్మగా నార్త్‌లో ఆయన విలనిజానికి బోలెడు ‘చెడ్డ’ పేరు వచ్చింది. ‘‘బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం ఏమిటి?’’ అనే ప్రశ్నకు- ‘‘అవకాశాలు రాకపోవడమే’’ అని చెప్పే రావత్ తనకు అవకాశం ఇచ్చిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ‘ఉత్తమ విలన్’గా గట్టి పేరు సంపాదించుకున్నాడు. ‘లగాన్’లో దేవ పాత్ర ముఖేష్ రుషి చేయాల్సింది. అయితే డేట్స్ సమస్య వల్ల ఆ పాత్రను ముఖేష్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ అవకాశం రావత్‌కు వచ్చింది. ‘లగాన్’లో సర్దార్జీ పాత్ర ముఖేష్ చేసి ఉంటే....రావత్ ‘లగాన్’లో నటించేవాడు కాదు. ‘లగాన్’లో నటించకపోతే...రాజమౌళి దృష్టిలో పడి ఉండేవాడు కాదు. రాజమౌళి దృష్టిలో పడి ఉండకపోతే... సౌత్‌లో స్టార్ విలన్‌గా పేరుతెచ్చుకొని ఉండేవాడు కాదు... ఎంత చిత్రం! -
సినిమా రివ్యూ: వీరుడొక్కడే
తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరం' చిత్రం 'వీరుడొక్కడే'గా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్యాయం, చెడు, ఫ్యాక్షన్‌ను ఎదిరించి...మంచి కోసం ఎంతవరకైనా తెగించే మనస్తత్వం కల వ్యక్తి వీరేంద్ర(అజిత్). తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నలుగురు సోదరుల కోసం వీరేంద్ర పెళ్లికి దూరంగా ఉంటాడు. అన్యాయం, అక్రమాలను పాల్పడే వీరభద్రం (ప్రదీప్ రావత్) దుశ్చర్యల నుంచి ప్రజల్ని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో తన సహచరులతో ఆ గ్రామంలోకి ప్రవేశించిన గోమతి దేవి (తమన్నా) అనే అర్కిటెక్ట్.. వీరేంద్ర ప్రేమలో పడేలా నలుగురు సోదరులు ప్లాన్ చేస్తారు. వీరేంద్ర మంచితనాన్ని చూసి గోమతి ప్రేమలో పడుతుంది. గోమతి ప్రేమ కోసం ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని వీరేంద్ర నిర్ణయం తీసుకుంటాడు. తమ గ్రామంలో నాగరాజు (అతుల్ కులకర్ణి) గ్రూప్‌తో జరిగిన సంఘటన ప్రభావంతో హింస, గొడవలు, కొట్లాట, ఫ్యాక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని గోమతి కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. వీరేంద్రను పెళ్లి చేసుకుందామనుకునుకున్న తరుణంలో గోమతిపై నాగరాజు గ్రూప్ ఎటాక్ చేస్తుంది. నాగరాజు గ్రూపును వీరేంద్ర ఎదుర్కొని.. గోమతిని ఆ దాడి నుంచి రక్షిస్తాడు.. అయితే ఆ సంఘటనలో వీరేంద్ర అసలు రూపాన్ని గోమతి చూస్తుంది. తనకు ఇష్టం లేని వ్యవహారాలే వీరేంద్ర జీవితంలో ప్రధానమైనవని తెలుసుకున్న గోమతి షాక్ అవుతుంది. వీరేంద్ర అసలు జీవితం తెలుసుకున్న తర్వాత గోమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గోమతిపై ఎటాక్ ఎందుకు జరిగింది. నాగరాజు అసలు గోమతి కుటుంబంపై ఎందుకు పగ పెంచుకుంటాడు? నాగరాజు, వీరభద్రం గ్రూప్‌ల ఆటకట్టించి.. గోమతిని, తన కుటుంబాన్ని వీరేంద్ర ఎలా రక్షించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ’వీరుడొక్కడు’. మాస్, యాక్షన్ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్న వీరేంద్ర పాత్రలో అజిత్ కనిపించారు. ప్రేమ కోసం హింస, ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పిన వ్యక్తిగా, ప్రేయసి కోసం, ప్రేమను పంచిన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లే మరో షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను అజిత్ అవలీలగా పోషించాడు. అయితే గతంలో చాలా చిత్రాల్లోఇలాంటి పాత్రల్లో కనిపించిన అజిత్.. మరోసారి రొటీన్‌గానే అనిపించాడు. అర్కిటెక్ట్‌గా గోమతి పాత్రలో ఓ సంప్రదాయ యువతిగా తమన్నా కనిపించింది. ఈ చిత్రంలో గోమతి పాత్ర ప్రధానమైనప్పటికి... సహజంగా ప్రేక్షకులు ఆశించే గ్లామర్ మిస్ కావడం నిరాశ కలిగించే అంశం. గోమతి పాత్ర కారెక్టరైజేషన్ పర్ ఫెక్ట్‌గా లేకపోవడం కొంత మైనస్. అంతేకాకుండా గోమతి పాత్ర కృత్రిమంగా కనిపిస్తుంది. విలన్లు ప్రదీప్ రావత్, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినా.. చిత్రంలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపేలా విలనిజం లేకపోవడం ప్రధాన లోపమని చెప్పవచ్చు. తమన్నా తండ్రిగా నాజర్ పర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో బాగా నచ్చే అంశం లాయర్ పాత్రలో సంతానం పండించిన కామెడీ. సంతానం కామెడి ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గొప్పగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెట్రీ ఫోటోగ్రఫి చిత్రానికి అదనపు ఆకర్షణ. యాక్షన్ సీన్ల చిత్రీకరణ రిచ్‌గా ఉంది. భూపతి రాజా, శివ అందించిన కథలో కొత్తదనం లేకపోయింది. సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.