మద్యపాన నిషేధానికి ఉద్యమం
కాగజ్‌నగర్ రూరల్ : మద్యపాన నిషేధానికి ఉద్యమిస్తామని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు అందె మంగ తెలిపారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై అన్ని హింసలకు కారణమైన మద్యపానాన్ని నిషేధించేందుకు క్రియాశీలక ఉద్యమం చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై సారా వ్యతిరేక పోరాటంలో పీవోడబ్ల్యూ క్రియాశీల పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
ఐకేపీ సంఘాలకు రుణ మాఫీ వర్తింపజేయాలని, ఆర్పీలకు గౌరవ వేతనం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ 20న శ్రీరాంపూర్‌లో పీవోడబ్ల్యూ తూర్పు ప్రాంత 5వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కాగజ్‌నగర్ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలుగా ఆర్.కుమారి, అధ్యక్షురాలుగా కె.హారతి, ఉపాధ్యక్షురాలుగా సిహెచ్.నాగనందిని, ప్రధాన కార్యదర్శిగా బి.శ్యామల, సహాయ కార్యదర్శిగా బి.లావణ్య, కోశాధికారిగా సంతూర్బాయి, ప్రచార కార్యదర్శి రత్నం లక్ష్మీ ఎన్నికయ్యారు.