అంతా కలలా అనిపించింది!
‘‘మన్మథుడి పక్కన యాభై వేల దీపకాంతులు, పూలు, పళ్ల మధ్య ధగధగ మెరిసే బంగారు రంగు గౌనులో నేను. టిపికల్ రాఘవేంద్రరావు స్టైల్లో సాగే శృంగారభరిత గీతంలో నటించడం మధురమైన జ్ఞాపకం. సినిమాలో అమ్మాయి కలగనే పాట అది. ఆ పాటలో నటించడం నాకూ కలలానే అనిపించింది’’ అన్నారు ప్రజ్ఞా జైశ్వాల్. హాథీరామ్‌బాబా కథతో నాగార్జున హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. ఇందులో హాథీరామ్ బాబా టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆయన్ని ప్రేమించిన భవాని పాత్రలో ప్రజ్ఞ నటించారు. ఫిబ్రవరి 10న విడుదలవుతున్న ఈ చిత్రం గురించి ప్రజ్ఞ చెప్పిన సంగతులు...
► చిన్నప్పట్నుంచీ భవానీకున్న ఏకైక కల ఒక్కటే. రామ్‌బాబా (నాగార్జున పాత్ర)ని పెళ్లి చేసుకోవడం! కొంచెం రొమాన్స్, కొంచెం లవ్ ఉన్న పాత్ర. అయితే... పెళ్లి కుదిరిన తర్వాత ‘ఎప్పుడూ దేవుణ్ణి చూడాల’నే కోరికతో రామ్‌బాబా తిరుగుతున్నాడని తెలుస్తుంది. భగవంతుడి కంటే ఏదీ పెద్దది కాదని భవాని అర్థం చేసుకుని, తన ప్రేమని త్యాగం చేస్తుంది. భగవంతుడి దగ్గరకి అతణ్ణి పంపిస్తుంది.
►చిత్రంలో నాది చిన్న పాత్రే కానీ చాలా ముఖ్యమైన పాత్ర. నాగార్జున–కె. రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’ ‘శ్రీ రామదాసు’ చిత్రాలు చూశా. అలాంటి క్లాసిక్స్ తీసిన కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం కావడంతో నా పాత్ర నిడివి గురించి ఆలోచించకుండా అంగీకరించా. భక్తిరస చిత్రమైనా ఇందులో వాణిజ్య హంగులన్నీ ఉన్నాయి. భగవంతుడంటే నాకు నమ్మకముంది. కానీ, ప్రతిరోజూ గుడికి వెళ్లాలి, ఉపవాసం చేయాలనే నియమాలు పాటించను. ఈ కాలంలో అవన్నీ కష్టం కదా!
► కృష్ణవంశీ ‘నక్షత్రం’లో నా పాత్ర ‘ఓం నమో వేంకటేశాయ’లో చేసిన పాత్రకి పూర్తి భిన్నంగా ఉంటుంది. పగలు ఓ సినిమా, రాత్రి మరో సినిమా.. ఈ రెండు సినిమాల షూటింగ్... ఒకేరోజు చేయడం ఓ సవాల్ అనిపించింది. ఈ రెండిటి తర్వాత మనోజ్‌కి జోడీగా నటించిన ‘గుంటూరోడు’ పక్కా కమర్షియల్ సినిమా.