విద్యుత్ ఉద్యోగులకు సీఎం వరాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు భారీగా 35 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెరుగైన వైద్య పథకాన్ని విద్యుత్ ఉద్యోగులకు అమలు చేయాలని ఆదేశించారు. 6 వేల మందిని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై సానుకూలంగా స్పందించారు. న్యాయ స్థానాల్లో కేసులను ఉపసంహరించుకుంటే 600 మంది జేఎల్‌ఎంలను వెంటనే క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో శనివారం ప్రగతి భవన్లో సీఎం సమావేశమయ్యారు. పీఆర్సీ, ఇతర సమస్యలపై చర్చించిన అనంతరం అక్కడే సభలో ఉద్యోగులపై కేసీఆర్ వరాల వర్షం కురిపించారు.
ఊహించని రీతిలో భారీ ఫిట్‌మెంట్‌ను సీఎం ప్రకటించడంతో విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున కరతాళధ్వనులతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు. యాజమాన్యాలు ఒక్కో మెట్టు ఎక్కుతూ 22, 24, 25 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని, చివరకు 27 శాతానికి చేద్దామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రతిపాదించారన్నారు. ఉద్యోగ సంఘం నేత ప్రకాశ్ సైతం 32 శాతం అడిగారని, అయితే ఉద్యోగులు అసంతృప్తికి గురికాకుండా 35 శాతం ఇవ్వాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్త సబ్ స్టేషన్లకు ఉద్యోగులను నియమించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నట్లు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు అంశంపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
విద్యుత్ ఉద్యోగులతో పోలిక వద్దు..
‘‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్లు ఎట్ట ఉంటరో చూస్తం.. ఎలా బతుకుతరో చూద్దాం.. అని దేశమంతా చూస్తున్న తరుణంలో తొలి విజయాన్ని సాధించి పెట్టింది విద్యుత్ శాఖనే. అందుకు మీకు మంచి జీతాలు రావాలి. విద్యుత్ శాఖకు ఆదాయం ఉంది. ఇతర శాఖల్లో ఉద్యోగుల మీద ఉన్న ఖర్చు ఇక్కడ లేదు. కరెంటోళ్లకు ఇచ్చే జీతం మాకూ ఇవ్వాలని ఇతర శాఖల వాళ్లు అడిగారు. కరెంటోళ్లు బాగా సంపాదిస్తున్నరు. మీరు(ఇతర శాఖలు) అంత సంపాదిస్తలేరు. మీరు వారితో పోల్చుకోకూడదని వారికి చెప్పిన’’అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం విద్యుత్ ఉద్యోగులు ఇంకా బాగా పని చేయాలని కోరారు. ఏ మూలకైనా విద్యుత్ అమ్మే పరిస్థితి రావాలన్నారు. గతేడాది జూరాల జల విద్యుత్ విక్రయాలతో రూ.250 కోట్ల ఆదాయం వచ్చిందని, గత రెండు నెలల్లో రూ..100 కోట్లను విద్యుత్ సంస్థలు సంపాదించాయన్నారు.
అపరిమిత వైద్య సదుపాయం...
విద్యుత్ ఉద్యోగుల కోసం అత్యుత్తమ వైద్య పథకానికి రూపకల్పన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జీవితంలో ఒకసారి రూ.3 లక్షల వైద్య సదుపాయం పొందితే మళ్లీ ఇవ్వం అనే ప్రస్తుత పథకం బాగాలేదన్నారు. మళ్లీ జబ్బు వస్తే ఎలా? రోగం చెప్పి వస్తదా? అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు వచ్చినా ఇచ్చేటట్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా సీఎం ఓ పిట్టకథను వినిపించారు. రాజుల కాలంలో ఓ ఊరిలో పెద్ద ఎత్తున కలరా వచ్చిందని, వైద్యులు ఏం చేసినా నయం కాలేదన్నారు. దీంతో రాజుగారు పెద్ద భూత వైద్యుడికి కబురు పంపారని, ఆయన ఊరికి వస్తుంటే అదే దారిలో కలరా గత్తర వెళ్తూ కనిపించిందన్నారు. 150 మందిని చంపినవా? అని భూత వైద్యుడు అడిగితే.. లేదు నేను 5 మందినే చంపినా.. మిగిలిన వారంతా భయంతోనే మృతిచెందారని గత్తర చెప్పిందని పేర్కొన్నారు. ఏం లేనోడికి భయంతో బీమారీలొస్తాయని, ఏమైనా అయితే చూసేటోళ్లు ఉన్నరని భావించే వారు ఆరోగ్యంగా ఉంటరని చెప్పారు.
శ్రమ దోపిడి సరికాదు..
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడి సరికాదని సీఎం పేర్కొన్నారు. విద్యుత్ బిల్ కలెక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా, చంద్రబాబు పెట్టి పోయిన దుకాణం ఇది అని మండిపడ్డారు. ఇప్పటికే కొన్ని వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించామని, బిల్ కలెక్టర్ల సమస్యలను సైతం సానుభూతితో పరిశీలిస్తామన్నారు.
ఆర్థిక వృద్ధిలో మనకు సాటి లేరు..
‘‘రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్ని శాపాలు. ఎన్ని దీవెనలు. వీళ్లతో అయితదా అని ఒకడు. కాదని ఇంకొకడు. మొత్తం చీకటి అయితదని మరొకడు. రకరకాలుగా మాట్లాడిండ్రు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా గత 4 ఏళ్లలో తెలంగాణ 17.17 శాతం ఆర్థిక వృద్ధి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5 నెలల లెక్క తీసి చూస్తే 17.83 శాతం వృద్ధి నమోదైంది. దీనికి ప్రధాన కారణం విద్యుత్ ఉద్యోగులే. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్ని బాధలు.. ఎన్ని కథలు.. కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. కరిగిపోయే కండక్టర్లు.. యాద్ చేసుకుంటే ఇప్పుడు రామాయనమంత కథ. ఆ బాధలన్నీ ఆరు నెలల్లో మాయం చేసి రైతాంగానికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇవాళ తెలంగాణ. దీనికి ప్రధాన కారకులు మీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రఘుమారెడ్డి, డైరెక్టర్లు, వాళ్లకు హన్మంతుడిలా పనిచేసే కార్మికులు. మీరంతా కలిస్తేనే ఈ ఫలితం. నేను కూడా మీ వెంబడి ఉన్న. ఆయింత నన్ను పక్కకు చేసేరు సుమ. కింద మీద పడి అందరం ఒక దరికి వచ్చినం’’అని సీఎం విద్యుత్ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు.
రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఎత్తిపోతల పథకాలు కడుతున్నామని, ఎంతైన కరెంట్ ఇస్తారన్న ధీమాతో వీటిని నిర్మిస్తున్నామన్నారు. లిఫ్టులు వస్తే రాష్ట్రంలో ఆనందమే ఆదనందం ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి లిఫ్టులను పూర్తి చేసి 1,000 చెరువులు నింపుకుంటూ 9 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు ఇచ్చామన్నారు. కొత్తకోట, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట ప్రాంతాలను నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ప్రజలు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. మా ఊర్లో 670 కార్డులున్నయి.. హైదరాబాద్ కార్డులను సరెండర్ చేస్తం.. ఇక్కడే రేషన్ ఇవ్వండి అని అక్కడి తహశీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నారన్నారు. రాబోయే ఎత్తిపోతల పథకాలకు కార్మిక, విద్యుత్ శాఖలే పెద్ద భరోసా అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రమ, విద్యుత్ సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.