కర్నూలు నాటకానికి ఏడు నందులు
రికార్డు సృష్టించిన ప్రమీలార్జున పరిణయం
– నంది నాటకోత్సవ చరిత్రలోనే
అరుదైన రికార్డు
కర్నూలు(కల్చరల్): రాష్ట్రస్థాయి నంది నాటక పోటీల్లో కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘ప్రమీలార్జున పరిణయం’ పద్యనాటకం ఏడు నంది అవార్డులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నాటకానికి ఉత్తమ ద్వితీయ ప్రదర్శన(వెండి నంది), ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ హాస్యనటి, ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డులు లభించాయి. నాటకానికి దర్శకత్వం వహించిన పత్తి ఓబులయ్యకు ఉత్తమ దర్శకుడు, రచన చేసిన ప్రముఖ నాటక రచయిత పల్లేటి కులశేఖర్‌కు ఉత్తమ రచయిత, నాటకంలో అర్జున పాత్ర పోషించిన బాల వెంకటేశ్వర్లుకు ఉత్తమ నటుడు అవార్డులు లభించాయి. నారద పాత్ర పోషించిన శామ్యూల్‌కు ఉత్తమ సహాయ నటుడు, కుతూహలం పాత్ర పోషించిన విజయకు ఉత్తమ హాస్యనటి, సంగీత దర్శకత్వం వహించిన రామలింగంకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది.
నంది నాటక పోటీల్లోనే తొలిసారిగా ఏడు నందులు సాధించి అరుదైన రికార్డు సృష్టించి కర్నూలు కళారంగ ఖ్యాతిని ఇనుమడింపజేసిన లలిత కళాసమితిని పలువురు నాటకరంగ మేధావులు అభినందించారు. లలిత కళాసమితి రాష్ట్రస్థాయి నంది నాటక పోటీల్లో ఏడు నందులు సాధించడం పట్ల తెలుగు కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ ఎం.పి.ఎం.రెడ్డి, ప్రముఖ నవలా నాటక రచయిత ఎస్.డి.వి.అజీజ్, ప్రముఖ జానపద కవి డాక్టర్ వి.పోతన ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.