‘ప్రాణహిత’ మీ ఇంటి వ్యవహారమా?
సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ధ్వజం
* ప్రాజెక్టు డిజైన్ మార్పుపై నిపుణుల అభిప్రాయాలు వద్దా?
* దీన్ని మేం అంగీకరించం, ప్రభుత్వంపై పోరాడతాం
* ఈ అంశంపై సాగునీటి రంగ నిపుణులతో టీపీసీసీ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: వేల కోట్ల ప్రజాధనం, భావితరాల భవిష్యత్తుతో ముడిపడిన ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుసరిస్తున్న వైఖరిపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.
శాసనసభలో చర్చించకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా, మేధావుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కేసీఆర్ నిర్ణయించడాన్ని ఉత్తమ్ తప్పుబట్టారు. ఇదేమైనా సీఎం సొంతింటి వ్యవహారమా? అని ప్రశ్నించారు. ప్రాణహిత డిజైన్ మార్పును అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం దిగువకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనివల్ల రాష్ట్రానికి కలిగే లాభనష్టాలపై అవగాహన కోసం సాగునీటిరంగ నిపుణులు, జలసాధన సమితి నేతలతో టీపీసీసీ నేతలు గురువారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.
ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, జి.వినోద్, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డి.కె.అరుణ, డీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జలసాధన సమితి నేత గోవర్ధన్ ప్రాణహిత పాత డిజైన్ వల్ల ఉపయోగాలు, కొత్త డిజైన్ వల్ల నష్టాలను నేతలకు వివరించారు. వ్యాప్కోస్ సంస్థ తన నివేదికలో తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని పేర్కొందని, ఆ ప్రకారమే అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని వివరించారు.
కాంగ్రెస్ హయాంలోనే 16 ప్రాంతాల్లో కాలువలు, సొరంగాల తవ్వకానికి వేల కోట్లు ఖర్చుచేశారన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని, కరెంటు ఉత్పత్తికి కూడా అవకాశముందని గోవర్ధన్ వివరించారు. దీన్ని మార్చాలనే ఆలోచన సరికాదని, అన్ని సంఘాలు, పార్టీలు ప్రాణహితను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణాధారమని, గుండెకాయ వంటిదన్నారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటూ టీఆర్ఎస్ నేతలు గతంలో ఉద్యమించారని గుర్తుచేశారు. దీని నిర్మాణానికి ఇప్పటికే 36 అనుమతులు వచ్చాయని, ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉందన్నారు.
ఈ దశలో ప్రాజెక్టు డిజైన్ మార్పు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో, కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టును పూర్తిచేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏమిటో చెప్పకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. డిజైన్ మార్పు వల్ల కలిగే నష్టాలపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని తక్షణమే సమావేశపరచి వివరించాలని, లేకుంటే అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.