ప్రతీక్, సమిత్ మెరుపు శతకాలు
జింఖానా, న్యూస్‌లైన్: శ్రీచైతన్య టెక్నో స్కూల్ బ్యాట్స్‌మన్ సమిత్ రెడ్డి (94 బంతుల్లో 168), ప్రతీక్ రెడ్డి (80 బంతుల్లో 106) మెరుపు సెంచరీలతో చెలరేగారు. దీంతో హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీచైతన్య జట్టు 311 పరుగుల భారీ తేడాతో సెయింట్ జోసెఫ్ గ్రామర్ హైస్కూల్‌పై ఘన విజయం సాధించింది.
మొదట బరిలోకి దిగిన శ్రీచైతన్య 5 వికెట్లు కోల్పోయి 453 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి ప్రజ్ఙయ్ రెడ్డి (50) అర్ధ సెంచరీతో రాణించగా, ఆశిష్ (36), సిద్ధార్థ్ (33 నాటౌట్) మెరుగ్గా ఆడారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ జోసెఫ్ జట్టు 142 పరుగులకే కుప్పకూలింది.
సాయి రాజ్ (41) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు. శ్రీచైతన్య బౌలర్లు కార్తీక్ రెడ్డి, సమిత్ రెడ్డి చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. మరో మ్యాచ్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్ హైస్కూల్ 8 వికెట్ల తేడాతో సమరిటన్స్ హైస్కూల్‌పై ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సమరిటన్స్ 187 పరుగులు చేసింది. దీపాంకర్ (57) అర్ధ సెంచరీ చేశాడు. సెయింట్ ఫ్రాన్సిస్ బౌలర్ ప్రీతమ్ రాజ్ 4 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన సెయింట్ ఫ్రాన్సిస్ రెండే వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. హర్షవర్ధన్ (95 నాటౌట్), జార్జ్ (56 నాటౌట్) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఠ సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ హైస్కూల్: 228 (సాయి చరణ్ 60, మానస్ 69; తిలక్ 3/36); క్రిసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్: 158 (తిలక్ 53, రాఖ 31) ఠ నిజామాబాద్ డిస్ట్రిక్ట్: 239/5 (సిద్ధు 43, అనికేత్ 47, శ్రవణ్ 48); జూబ్లీహిల్స్ హైస్కూల్: 69 (శ్రవణ్ 5/9) ఠ జాన్సన్ గ్రామర్ హైస్కూల్: 133 (రిత్విక్ కుమార్ 3/22, మహ్మద్ షోయబ్ 3/22); డాన్ బాస్కో హైస్కూల్: 134/9 (లలిత్ ఆదిత్య 3/35) ఠ చిరెక్ పబ్లిక్ స్కూల్: 189 (వంశీ 72, అభిషేక్ ఆశిష్ 58 నాటౌట్; రాకేష్ కుమార్ 5/44); కేంద్రీయ విద్యాలయ: 190/4 (ప్రీతమ్ 67, అనుజ్ 39) ఠ ఢిల్లీ పబ్లిక్ స్కూల్: 180 (మనో సాత్విక్ 47); న్యూ రాయల్ హైస్కూల్: 184/5 (లియాఖత్ 31, రిత్విక్ 30).