సిద్ధు ఈజ్ బ్యాక్!
వస్తుతః తమిళుడైనా, అక్కడి కన్నా తెలుగులో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో - సిద్ధార్థ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న ఆయన కొంతకాలంగా నేరు తెలుగు చిత్రాల్లో కనిపించడం లేదు. తాజాగా ఇప్పుడు ఆయన ఒక నేరు తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధమైనట్లు కృష్ణానగర్ కబురు. ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గతంలో జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘చందమామ కథలు’, ఇటీవలే అధోజగత్తుకు చెందిన ఇద్దరు దొంగల జీవితాలపై తీసిన కామెడీ-థ్రిల్లర్ ‘గుంటూర్ టాకీస్’ ద్వారా పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్.
ఆయన తన తాజా ప్రయత్నానికి సిద్ధార్థ్‌ను కథానాయకుడిగా ఎంచుకొన్నారట! బహిర్గతం చేయకుండా మనం మనసులోనే దాచుకొనే ఆలోచనలు, అంతరంగ భావోద్వేగాలను నగ్నంగా ఆవిష్కరించే ఒక సున్నితమైన ప్రేమకథగా ఈ చిత్రకథను అల్లుకుంటున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్! ఇప్పటికే ఈ స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేసిన దర్శకుడు ఏప్రిల్ ఆఖరు కల్లా షూటింగ్ మొదలుపెట్టేస్తారట! మొత్తానికి, సిద్ధార్థ్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇది షురూ అన్న మాట!