Pregnancy baby died
-
రోజంతా ఆపి అర్ధరాత్రి ఆపరేషన్
కామారెడ్డి టౌన్: వైద్యులు నిర్లక్ష్యంగానే గర్భంలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ, ఇందుకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ఎర్రంగారి యశోద పురిటి నొప్పులతో ప్రసవం కోసం బుధవారం ఉదయం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షించి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇంకా సమయం ఉందని ఆసుపత్రిలో ఉంచారు. తమ భార్యకు నొప్పులు వస్తున్నాయని మొదటి కాన్పు అని అవసరమైతే ఆపరేషన్ చేయాలని వైద్యులను వేడుకున్నానని యశోద భర్త భరత్ వాపోయాడు. బుధవారం అర్ధరాత్రి నొప్పులు రావడంలో ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్కు సమాచారం ఇచ్చారు. గైనిక్ వైద్యులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంలో సర్జన్ వైద్యులు నర్సింహరెడ్డి యశోదకు అర్ధరాత్రి సీజరియన్ చేశారు. అప్పడికే గర్భంలోనే ఆడ శిశువు మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. రాత్రి కావడంలో శిశువు మృతదేహన్ని ఆసుపత్రిలో ఉంచవద్దని, బయటకు తీసుకెళ్లాలని సిబ్బంది, సెక్యూరిటి దబాయించి బయటకు గెంటేశారని బంధువులు ఆరోపించారు. దీంతో రాత్రి శిశువును ఖననం చేశామన్నారు. గురువారం ఉదయం ఆసుపత్రిలో వైద్యాధికారులతో వాగ్వాదం చేశారు. బుధవారం ఉదయమే మిగతా మహిళలలతో పాటు తమ భార్యకు సీజరియన్ చేస్తే శిశువు బతికుండేదని భరత్ తెలిపాడు. ఆశ కార్యకర్తలు సైతం వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకోస్తే గైనిక్ వైద్యులు లేరంటూ రిఫర్లు చేస్తున్నారని, ఇలా శిశువుల మరణాలకు కారణమవుతున్నారని వాపోయారు. అనంతరం పట్టణ పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్కుమార్ను వివరణ కోరగా శిశువు ఉమ్మ నీరు మింగడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రిలో గర్భస్త శిశువు మృతి
కంబాలచెరువు(రాజమండ్రి) : ప్రభుత్వాస్పత్రిలో గర్భస్త శిశువు మృతి ఆందోళనకు దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితులు మండిపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. కాపవరానికి చెందిన కొత్తపల్లి శాంతిదుర్గ కాన్పు కోసం పుట్టిల్లైన హుకుంపేట బాపూనగర్కు వచ్చింది. పురిటి సమయం దగ్గరపడడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి బుధవారం తల్లి సుగుణ, భర్త కొవ్వూరమ్మతో కలిసి వచ్చింది. సాయంత్రానికి శాంతిదుర్గకు నొప్పులు అధికంగా వస్తుండడంతో విషయాన్ని వైద్యులకు తెలిపారు. వారు ‘ఫర్వాలేదు ఫ్రీ డెలివరీ అవుతుంది, ఆపరేషన్ అవసరంలేదు’ అని చెప్పారు. మర్నాడు ఉదయం 10 గంటలకు పురిటినొప్పులు మరింత ఎక్కువయ్యాయి. విషయాన్ని మళ్లీ డ్యూటీ సిబ్బందికి తెలిపారు. వారు దురుసుగా సమాధానమిచ్చారు. దీంతో శాంతిదుర్గ కుటుంబసభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని అడిగారు. దీంతో వైద్యులు ‘ఏం మేం చెప్పేది వినరా డబ్బులు ఎక్కువగా ఉంటే తీసుకుపోండి, మాకు రూ.5 వేలు ఇస్తే ఆ ఆపరేషన్ మేమే చేసేస్తామం’ అంటూ మొదలుపెట్టారు. మధ్యాహ్నానికి ఆమెను పరీక్షించిన వైద్యులు బిడ్డకుకానీ, లేదా తల్లికి ఇద్దరిలో ఎవరోఒకరికి ప్రమాదముందని సాఫీగా చెప్పారు. మరికొద్దిసమయం గడిచేసరికి గర్భంలో శిశువు మృతిచెందాడంటూ చెప్పారు. చివరకు ప్రభుత్వాస్పత్రి వైద్యులు మృతశిశువును బయటకు తీశారు. దీంతో ఆగ్రహించిన శాంతిదుర్గ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. మహిళలపై మగపోలీసుల జులుం ఆస్పత్రి అధికారుల తీరుకు ఆగ్రహించిన శాంతిదుర్గ కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి బయట రోడ్డుపై ధర్నా చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ట్రైల్ రన్ నిర్వహిస్తున్న పోలీసులకు ధర్నా కనిపించింది. ఆందోళనకారులు రోడ్డుపైనుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు చెప్పారు. దీంతో ఆందోళనకారులు తమకు న్యాయం కావాలంటూ నినదించారు. దీంతో పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈక్రమంలో పోలీసులు నిబంధనలను మరిచారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న మహిళలను మగ పోలీసులు చేతులుపట్టుకుని రోడ్డుపైనుంచి బయటకు లాగేశారు. స్థానిక సీఐ జోక్యం తో చివరకు ఆస్పత్రి అధికారులు బయటకువచ్చారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.