prepaid cards
-
పెట్టుబడికి ‘ప్రీ పెయిడ్’ కార్డులు
సాక్షి, హైదరాబాద్ : ‘‘రైతు పెట్టుబడి పథకానికి బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయిస్తాం. మేలో ఇవ్వబోయే పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో ఇస్తాం. నవంబర్‌లో(రబీ) అందించబోయే రెండో విడత సాయం నుంచి ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ కార్డుల్లో ఎప్పటికప్పుడు నగదు క్రెడిట్ అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే ప్రతి రైతు వేదికకు రూ.12 లక్షలు మంజూరు చేస్తాం’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ యాసంగి నుంచే రైతు సమన్వయ సమితులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. 1.61 లక్షల రైతు సమన్వయ సమితుల సభ్యులంతా రైతు సైన్యమని, వారంతా ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్నంతవరకు రైతు సమితులు ఉంటాయన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రైతు సదస్సుకు 13 జిల్లాలకు చెందిన మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును ఖరారు చేసి, ఆయన్ను సభ్యులకు పరిచయం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘నాలుగైదు ఏళ్ల తర్వాత నాట్లు వేసేవాళ్లు దొరకరు. ప్రతి 5 ఎకరాలకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాల లెక్క తెలియాలి. నాట్లు వేసే యంత్రాలను 50 శాతం సబ్సిడీతో ఇస్తం. ఎక్కడ ఏ యంత్రాలు సమకూర్చాలో ప్రభుత్వం నిర్ణయిస్తది. అందరూ ఒకే పంట వేస్తే అందరికీ నష్టం. అధికారులు సూచించిన పంటలు పండిస్తే రైతులకు లాభం. మున్ముందు పంట కాలనీలను ఏర్పాటు చేస్తం. రైతు సమన్వయ సమితిలో పైరవీలకు ఆస్కారం ఉండొద్దు. రైతు సమన్వయ సమితి గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో కూర్చోదు. రైతు బాగుపడే వరకు చిత్తశుద్ధితో పని చేస్తం’’అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం లంచాలు ఇచ్చుడు బంద్ అని, పాస్‌బుక్ ఇవ్వడంలో సబ్ రిజిస్ట్రార్ ఆలస్యం చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని చెప్పారు. పాస్‌పోర్టు వచ్చినట్టే పాస్‌బుక్కులు కూడా పోస్టులో ఇంటికి వస్తాయన్నారు. రైతుల సంపద.. 1.25 లక్షల కోట్లు ‘‘మార్కెట్‌కు తెచ్చే ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే వర్షాకాలపు పంట ఒక్క గింజ కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మనివొద్దు. చెక్కుల పంపిణీలో క్రమశిక్షణ పాటించిన గ్రామాల రైతులను ఇజ్రాయెల్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తం. రైతులకు 75 శాతం సబ్సిడీతో టార్పాలిన్లను ఇస్తాం. అటవీ శాఖ సహకారంతో కోతులు, అడవి పందుల బెడద తగ్గిస్తం. సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం’’అని వెల్లడించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, పాలమూరు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే రాష్ట్రంలో రెండు పంటలు పండుతాయన్నారు. రెండు పంటల ద్వారా వచ్చే పంట విలువ రూ.1.25 లక్షల కోట్లు ఉంటుందని, ఇది రైతులకు చేరే సంపద అని పేర్కొన్నారు. తెలంగాణ మొత్తాన్ని అంకాపూర్‌ను మించి తీర్చిద్దాలని అప్పుడే రైతు సమన్వయ సమితులు విజయం సాధించినట్లని వ్యాఖ్యానించారు. రైతు సమన్వయ సమితి సభ్యులు అంకాపూర్ గ్రామాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రికి సూచించారు. ‘పెట్టుబడి’సొమ్ము వదులుకుంటున్నా ‘‘నాకు పెట్టుబడి పథకం కింద సొమ్ము వస్తుంది. కానీ దాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నా. ఇలా పెద్దలు పెట్టుబడి సొమ్మును వదులుకుంటే.. ఆ సొమ్మంతా రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో జమ అవుతుంది. కార్పస్‌ఫండ్‌గా ఉంటుంది’’అని సీఎం చెప్పారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఆరేడు కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇస్తామన్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే అవకాశం ఉందన్నారు. ‘‘రైతు సమితులు వస్తే స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాయని కాంగ్రెస్ వారు అంటున్నారు. రైతులకు సంస్థను ఏర్పాటు చేస్తే సన్నాసి మాటలు మాట్లాడున్నారు. కేసీఆర్ ఉన్నంత వరకు రైతు సమితులు ఉంటాయి. వాటిని ఎవరూ రద్దు చేయలేరు’’అని పేర్కొన్నారు. రైతు సమితులు పైరవీలకు ఆస్కారం ఇవ్వొదన్నారు. మే నెలలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గ్రామాల్లో పెట్టుబడి పథకం చెక్కుల్ని పంపిణీ చేయాలన్నారు. వచ్చే వానాకాలం పంటను కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా అమ్ముతామని సమితులు ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. సర్వే చేస్తే సీఎంగా తనకు 90 శాతం మార్కులు వచ్చాయని, కేసీఆర్‌గా 93 శాతం వచ్చాయని చెప్పారు. అలా చేస్తే మీతో కలిసి డ్యాన్స్ చేస్తా.. ‘‘ఖమ్మం మార్కెట్లో మిర్చి గొడవకు కారణమేంటి? ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం వల్లే ఇదంతా జరుగుతుంది. కాబట్టి నియంత్రిత వ్యవస్థ ఏర్పడాలి. ఏ గ్రామాలు ఎప్పుడు మార్కెట్‌కు తీసుకురావాలో రైతు సమితులు నిర్ణయించాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే నేను కూడా మీతో కలిసి డ్యాన్స్ చేస్తా’’అని సీఎం అన్నారు. రైతు సమితులు దేశంలో ఎక్కడైనా గిట్టుబాటు ధరకు ఆహార పంటలను అమ్ముకునేందుకు అనుమతిస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.62 కోట్ల ఎకరాల భూమి తేలిందని, అందులో 1.42 కోట్ల ఎకరాలు రైతులవని చెప్పారు. మరో 20 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములని, మరో 2–3 లక్షల ఎకరాలు వివాదాస్పద అసైన్డ్ భూములని వివరించారు. అటుఇటుగా 1.65 కోట్ల ఎకరాలు తేలుతుందని, ఈ భూమి కలిగిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. తెలంగాణలో ఇక కరెంటు పోదు కాబట్టి ఆటో స్టార్టర్లను తీయించే బాధ్యత రైతు సమన్వయ సమితులు తీసుకోవాలని కోరారు. 24 గంటల కరెంటు వద్దు... 12 గంటలే కావాలని కొందరంటున్నా అలా చేయబోమని స్పష్టంచేశారు. రెవెన్యూ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చినట్లే మంచిగా పనిచేస్తే వ్యవసాయాధికారులకు కూడా ఇస్తామన్నారు. ఉద్యోగుల జీతాలు పెంచుతామని, అయితే వారంతా లంచం లేకుండా పనిచేయాలని అన్నారు. అసైన్డ్ రైతులకు కూడా పెట్టుబడి సాయం అందజేస్తామని, ఉద్యాన, పండ్ల రైతులకు కూడా రూ.4 వేల చొప్పున సాయం చేస్తామన్నారు. సదసుసలో సూర్యాపేటకు చెందిన మాలోత్ కృష్ణ.. ఫిలిఫ్పైన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కూతురి కష్టం గురించి చెప్పారు. ఓవర్సీస్ పథకం కింద స్కాలర్షిప్ ఇవ్వనంటున్నారంటూ ఏడుస్తూ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి వెంటనే స్పందించిన సీఎం స్కాలర్షిప్ మొత్తాన్ని తాను ఇప్పిస్తానని హామీయిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, నాయిని నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాల్లో మార్కెట్ మినీ యార్డులు: హరీశ్ ఇప్పటివరకు రాష్ట్రంలో 25 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాములున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో మినీ మార్కెట్ యార్డును ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ఇందుకు కేంద్రం సహకారం కోరుతామన్నారు. కాగా, రైతు వేదికలకు ఎకరం భూమి విరాళంగా ఇచ్చిన మక్తల్ నియోజకవర్గ రైతు వెంకటరెడ్డిని సీఎం సన్మానించారు. ‘ఉపాధి’పై కేంద్రం స్పందించడం లేదు ‘‘ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సభను చూసైనా కేంద్రం బుద్ధి తెచ్చుకోవాలి. ఇదే అంశంపై ప్రధానికి ఇప్పటివరకు 20 ఉత్తరాలు రాశా. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపా. అయినా అక్కడి నుంచి స్పందన లేదు’’అని సీఎం అన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఈ సదస్సులోనూ తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు. మళ్లీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో రైతుల కోసం పనిచేయలేదని విమర్శించారు. రైతుకు ఏదైనా చేయాలని ప్రధానికి పదిసార్లు చెప్పానని, అయినా కేంద్రం నుంచి సహకారం లభించడంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. నేడు కరీంనగర్లో సదస్సు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణ ప్రాంతీయ రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. సోమవారం కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 16 జిల్లాల నుంచి మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు, ప్రజాప్రతిని«ధులు సుమారు 10 వేల మంది వరకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
‘నగదు రహితం’పై విస్తృత అవగాహన
►20 నుంచి విద్యార్థులు, లెక్చరర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ► ఇకపై ప్రీపెయిడ్ కార్డులు, రూపే కార్డులతోనే లావాదేవీలు ► మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీ లపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యూనివర్సిటీలు, కాలేజీల్లోని ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్లు, విద్యార్థులు, లెక్చరర్ల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(ఎంహెచ్ఆర్డీ) శాఖ నిర్ణ యించింది. ఇందులో భాగంగా యూనివర్సి టీల వీసీలకు మార్గదర్శనం చేసేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఎస్.మల్లేశం తెలిపా రు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ను కూడా నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేలా విద్యా సంస్థలు అవగాహన కల్పిం చేందుకు కేంద్రం కార్యాచరణ ప్రణాళిక జారీ చేసింది. విట్టియా సాక్షరతా అభియాన్ (విసాక) పేరుతో మార్గదర్శకాలు జారీ చేసిం ది. నగదు రహిత లావాదేవీల వల్ల చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. వీటి కోసం ప్రతి యూనివర్సిటీ, ప్రతి విద్యాసంస్థ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని నిర్దేశించింది. నగదు రహిత లావాదేవీలకు మార్గాలు... ♦ బ్యాంకు అకౌంట్ లేని వారు, మొబైల్ కూడా లేని వారు: ఇలాంటి వారితో జన్‌ధన్ ఖాతా ఓపెన్ చేరుుంచేలా చర్యలు చేపట్టాలి. రూపే, ప్రీపెయిడ్ కార్డులను నిత్యావసరాలకు వినియోగించేలా అవగాహన కల్పించాలి. ♦ బ్యాంకు అకౌంట్ ఉన్నా మొబైల్ లేనివారు: బ్యాంకుల నుంచి రూపే కార్డులు తీసుకునేలా చైతన్యపరచాలి. అన్ని అవసరాలకు వాటినే స్వైప్ చేసేలా చర్యలు చేపట్టాలి. ♦ బ్యాంకు అకౌంట్ ఉండి, ఫీచర్ ఫోన్ ఉన్నవారు: రూపే కార్డులను వినియోగించి తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేయాలి. ♦ షాపుల్లో (పాయింట్ ఆఫ్ సేల్-పీవోఎస్) స్వైపింగ్ మిషన్లు లేకపోతే జీఎస్ఎం సిమ్ ఆధారంగా అన్‌స్ట్రక్షర్డ్ సప్లిమెంటరీ సర్వీసు డాటా (యూఎస్ఎస్డీ), మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ (ఎంఎంఐడీ) పద్ధతుల్లో లావాదేవీలు నిర్వహించాలి. ♦ బ్యాంకులు ఇచ్చే ఏడు డిజిట్ల ర్యాండమ్ నంబరు ఉపయోగించి డబ్బు వినియోగదారుని అకౌంట్ నుంచి షాపు యజమాని అకౌంట్లోకి పంపించే విధానంపై అవగాహన కల్పించాలి. ♦ బ్యాంకు అకౌంట్, స్మార్ట్ ఫోన్ ఉన్నవారు: రూపే కార్డు, డెబిట్ కార్డులను వినియోగించేలా, స్వైపింగ్ విధానం, మొబైల్ వాలెట్ వినియోగించేలా అవగాహన కల్పించాలి. ఇదీ కార్యాచరణ ♦ ఈ నెల 10వ తేదీలోగా డిజిటల్ పేమెంట్ విధానం అవగాహన కల్పించేలా ట్రైనర్లను గుర్తించాలి. ♦ ఈ నెల 14వ తేదీలోగా నగదు రహిత లావాదేవీలకు సంబంధించి విద్యార్థులు అందరికీ తెలియజేయాలి. ♦ వాలంటీర్లుగా పనిచేసే వారు ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలి. ♦ 15వ తేదీ నుంచి 20వ తేదీలోగా క్షేత్ర స్థాయికి వెళ్లి అవగాహన కల్పించే వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలి. ♦ 20వ తేదీ నుంచి జనవరి 12వ తేదీలోగా క్షేత్ర స్థాయికి వెళ్లి వాలంటీర్లు ప్రజల్లో అవగాహన కల్పించి, వారు నగదు రహిత లావాదేవీలవైపు వచ్చేలా చూడాలి. మార్కెట్లలో తేవాల్సిన మార్పులు ♦ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్లు మార్పు తీసుకురావాల్సిన మార్కెట్లు, ప్రాంతాలను ఈ నెల 12లోగా గుర్తించాలి. ♦ వాటిని ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు సందర్శించి అక్కడ వ్యాపారాలు చేసేవారిని డిజిటల్ పేమెంట్ వైపు మళ్లించాలి. ♦ డిసెంబరు 23 నుంచి జనవరి 8వ తేదీ వరకు వాటి అమలును మరోసారి పరిశీలించి, వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. -
ఇక రీచార్జ్ చేసుకుంటేనే కరెంటు!
తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆ తర్వాత ఇతర కనెక్షన్లుకు విస్తరించే యోచన మార్చి 31లోగా బిగించాలని ఆదేశాలు జారీ ఇంట్లో కరెంటు పోయిందా.. రీచార్జ్ చేసుకోలేదేమో.. కరెంటుకు రీచార్జేంటి అనుకుంటున్నారా.. త్వరలో ఈ విధానం నగరంలో అమలుకాబోతోంది. మొబైల్ రీచార్జ్ చేసుకున్నట్లు కరెంటుకు కూడా రీచార్జ్ చేసుకోవాలి భవిష్యత్తులో.. సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): విద్యుత్ దుబారాను అరికట్టడంతో పాటు ప్రతి యూనిట్‌ను పక్కగా లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న మెకానికల్ విద్యుత్ మీటర్ల స్థానంలో ఇకపై ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు వీటిని బిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీఓ కూడా జారీ చేసింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. వీధిలైట్లకు మినహా అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటికీ ఈ మీటర్లను బిగించాలని సూచించింది. ఇందుకోసం ఇప్పటికే ఐదు వేల మీటర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ తరహా మీటర్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు అమర్చడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, గృహాల్లో చోటు చేసుకుంటున్న విద్యుత్ దుబారాకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా సంస్థకు వస్తున్న నష్టాలను కూడా నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. నగరంలో చాలామంది తమ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. చాలా మంది విద్యుత్ వినియోగంపై ఆంక్ష లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటు యజమానులకు, అటు అద్దెవాసులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చడం వల్ల విద్యుత్ వృథాను అరికట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ‘గ్రేటర్’ పరిధిలోనే సుమారు 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో రెండు వేలకుపైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి నెలకు అరకోటికిపైగా విద్యుత్ బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వం తమకు నిర్వహణ ఖర్చులు ఇవ్వడం లేదనే సాకుతో చాలా మంది అధికారులు తమ ఆఫీసుకు సంబంధించిన కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా డిస్కం రూ.కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఇలా పనిచేస్తాయి... ప్రస్తుతం ఉన్న పాత మెకానికల్ మీటర్లను తొలగించి, దాని స్థానంలో ప్రీపెయిడ్ కార్డుతో అనుసంధానించిన ప్రత్యేక మీటర్‌ను (సెల్‌ఫోన్ రీచార్జ్ తరహా) అమర్చుతారు. దీనికి ఓ సిమ్‌కార్డును అనుసంధానిస్తారు. విని యోగదారుడు ప్రతినెలా తన చేతిలోని సెల్ ఫోన్ రీచార్జీ చేసుకున్నట్లుగానే ఇకపై ఇంట్లోని విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇంట్లో విద్యుత్ లైట్లు వెలుగుతాయి. లేదంటే కార్డును రీచార్జీ చేసుకునే వరకు చీకట్లు తప్పవు. ఇందు కోసం ఆయా కార్యాలయాలు, సంస్థలు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే పూర్తి ఖర్చును డిస్కమే భరిస్తుంది. మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి, ఆ తర్వాత గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు కూడా ఈ తరహా సేవలను వ ర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. -
ఉగ్రవాదుల ప్రీపెయిడ్ లావాదేవీలు
పారిస్: ఇటీవలి కాలంలో నేరుగా నగదు రూపంలో చెల్లింపులు తగ్గిపోయాయి. వీసా, మాస్టర్ కార్డుల లోగోలతో కూడిన ప్రీపెయిడ్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరిగాయి. ఇలాంటి కార్డుల వాడకం ద్వారా నగదు చెల్లింపు సులభం అవుతున్నా.. వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోలేదని ఇటీవలి పరిణామాలు తెలియజేస్తున్నాయి. పారిస్ దాడుల్లో 130 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడికి ముందు రోజు బస చేసిన హోటల్ బిల్లులు, ఇతర ఖర్చులకు ప్రీపెయిడ్ కార్డుల ద్వారా చెల్లింపులు చేపట్టడం ద్వారా నిఘా వర్గాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. కార్డులను ఉపయోగించే వ్యక్తి పేరును సైతం తెలియజేయాల్సిన అవసరం లేకుండా యూరప్‌లో ఈ ప్రీపెయిడ్ కార్డులను జారీ చేస్తారు. దీనివల్ల ఉగ్రవాదులు సులభంగా తమ లావాదేవీలను నిర్వహించుకోవడానికి వీలవుతుందని నిఘావర్గాలు తెలుపుతున్నాయి. ఫ్రాన్స్‌లో 2008 నుంచి జారీ చేస్తున్న ప్రీపెయిడ్ కార్డులు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. సాధారణంగా కార్డుల జారీకి బ్యాంక్ ఎకౌంట్ అనుసంధానం అవుతుంది. కానీ బ్యాంకుల మధ్య పోటీ వల్ల వ్యక్తిగత వివరాలను నమోదు చేయకుండానే బ్యాంకింగేతర రంగాలలో వాడటానికి ప్రీపెయిడ్ కార్డులను జారీ చేస్తున్నారు. 18 ఏళ్ల వయసు నిండితే చాలు.. ఈ కార్డులను పొందవచ్చు. ఈ కార్డులను రీచార్జ్ చేసుకొని విదేశాలలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి వీలుగా నిబంధనలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాదులు నిఘా వర్గాలకు చిక్కకుండా డబ్బును బదిలీ చేసుకున్నారని తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు తమ దృష్టికి వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ అధికారులు భావిస్తున్నారు.