ఉగ్రవాదుల ప్రీపెయిడ్ లావాదేవీలు | prepaid cards are helping finance terrorists | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల ప్రీపెయిడ్ లావాదేవీలు

Published Mon, Nov 30 2015 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

prepaid cards are helping finance terrorists

పారిస్: ఇటీవలి కాలంలో నేరుగా నగదు రూపంలో చెల్లింపులు తగ్గిపోయాయి. వీసా, మాస్టర్ కార్డుల లోగోలతో కూడిన ప్రీపెయిడ్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరిగాయి. ఇలాంటి కార్డుల వాడకం ద్వారా నగదు చెల్లింపు సులభం అవుతున్నా.. వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోలేదని ఇటీవలి పరిణామాలు తెలియజేస్తున్నాయి. పారిస్ దాడుల్లో 130 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడికి ముందు రోజు బస చేసిన హోటల్ బిల్లులు, ఇతర ఖర్చులకు ప్రీపెయిడ్ కార్డుల ద్వారా చెల్లింపులు చేపట్టడం ద్వారా నిఘా వర్గాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

కార్డులను ఉపయోగించే వ్యక్తి పేరును సైతం తెలియజేయాల్సిన అవసరం లేకుండా యూరప్లో ఈ ప్రీపెయిడ్ కార్డులను జారీ చేస్తారు. దీనివల్ల ఉగ్రవాదులు సులభంగా తమ లావాదేవీలను నిర్వహించుకోవడానికి వీలవుతుందని నిఘావర్గాలు తెలుపుతున్నాయి.

ఫ్రాన్స్లో 2008 నుంచి జారీ చేస్తున్న ప్రీపెయిడ్ కార్డులు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. సాధారణంగా కార్డుల జారీకి బ్యాంక్ ఎకౌంట్ అనుసంధానం అవుతుంది. కానీ బ్యాంకుల మధ్య పోటీ వల్ల వ్యక్తిగత వివరాలను నమోదు చేయకుండానే బ్యాంకింగేతర రంగాలలో వాడటానికి ప్రీపెయిడ్ కార్డులను జారీ చేస్తున్నారు. 18 ఏళ్ల వయసు నిండితే చాలు.. ఈ కార్డులను పొందవచ్చు.

ఈ కార్డులను రీచార్జ్ చేసుకొని విదేశాలలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి వీలుగా నిబంధనలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాదులు నిఘా వర్గాలకు చిక్కకుండా డబ్బును బదిలీ చేసుకున్నారని తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు తమ దృష్టికి వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ అధికారులు భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement