వాడుకున్నంత!
సాక్షి, మెదక్: ఇక నుంచి విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్‌ఫోన్ రీచార్జి తరహాలోనే విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. జిల్లాలో త్వరలో ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించేందుకు ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో విద్యుత్ బకాయిలకు చెల్లుచీటి పడనుంది. అలాగే వినియోగదారులు వినియోగించే తీరులో మార్పుతో పాటు దుబారా తగ్గనుంది. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఈ మీటర్లను బిగించనున్నారు.
ఇందుకు సంబంధించి ట్రాన్స్‌కో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని, చెల్లించిన వెంటనే ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించనున్నారని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. మార్చి నాటికి ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో స్టోర్స్‌కు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు చేరుకున్నాయి.
దుబారా తగ్గుదలకు..
ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాకు మొదట విడతగా 400 నుంచి 500 వరకు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఇది వరకే ఈ మీటర్ల బిగింపు ప్రక్రియ విజయవంతమైనట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాల్లో సైతం ఈ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయించింది. నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు గృహ విద్యుత్ వినియోగదారులు ఎడాపెడా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ దుబారా పెరుగుతుంది. దీనికితోడు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన డబ్బులను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు చెల్లించడం లేదు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్కోపై విద్యుత్ బకాయిలు భారం పెరుగుతోంది. విద్యుత్ దుబారా, బకాయిలకు చెక్ పెట్టేందుకు వీలుగా ట్రాన్స్‌కో ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు సిద్ధం అవుతుంది.
రీచార్జి చేసుకుంటేనే..
ప్రస్తుతం అన్ని సర్వీసుల్లో మెకానికల్ విద్యుత్ మీటర్లు ఉన్నాయి. మెకానికల్ విద్యుత్ మీటర్ల రీడింగ్ ఆధారంగా బిల్లులు వసూలు చేస్తోంది. ప్రతినెలా ప్రభుత్వ కార్యాలయాలు, గృహ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు ఇచ్చినా వారు చెల్లించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రీపెయిడ్ మీటర్ల బిగించాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్‌ఫోన్ రీచార్జి తరహాలోనే ఇకపై విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రూ.500 నుంచి రూ.5వేల విలువతో ప్రీపెయిడ్ విద్యుత్ కార్డులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో మొదట మీ సేవ కేంద్రాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ రీచార్జి కార్డులను అందుబాటులో ఉంచనున్నారు.
రూ.కోట్లలో పేరుకు పోయిన బకాయిలు
జిల్లాలో విద్యుత్ బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలులతో పాటు గృహ వినియోగదారులు, పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో మొండి బకాయిలున్నాయి. గృహా విద్యుత్ బకాయిలు రూ.19 కోట్లు, పరిశ్రమలు రూ.2 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.1.13 కోట్లు, పంచాయతీ బకాయిలు రూ.122 కోట్లు చెల్లించాల్సి ఉంది.
దశల వారీగా..
జిల్లాలో దశలవారిగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించనున్నారు. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించనున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు 931 కార్యాలయాలకు ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు ఇచ్చారు. మెదక్ డివిజన్ పరిధిలో 627 ప్రభుత్వ కార్యాలయాలు, తూప్రాన్ డివిజన్ పరిధిలో 304 ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు అందజేశారు. ప్రీపెయిడ్ విద్యుత్‌మీటర్ల అమర్చేందుకు వీలుగా బకాయిలు రూ.1.13 కోట్లు ట్రాన్స్‌కో వసూలు చేయనుంది. డబ్బులు వసూలు అయిన వెంటనే ఈ మీటర్లను అమర్చనున్నారు.
త్వరలోనే బిగిస్తాం
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో మొదటగా ఈ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చుతాం. సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో స్టోర్స్‌కు ఈ మీటర్లు ఇప్పడికే వచ్చాయి. త్వరలోనే జిల్లాకు మీటర్లు తీసుకువచ్చి బిగింపు ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రీ పెయిడ్ మీటర్లతో విద్యుత్ దుబారా తగ్గడంతోపాటు బకాయిల భారం తొలుగుతుంది.
–శ్రీనాథ్, ట్రాన్స్‌కో ఎస్ఈ