రచ్చ..రచ్చేనా!
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల పోస్టింగ్ ఆర్డర్లు రద్దు
నేడు డీఎంహెచ్ఓ కార్యాలయంలో రీ పోస్టింగ్‌కు కౌన్సెలింగ్
ఆందోళనకు సిద్ధమైన తొలగించిన అభ్యర్థులు
అనంతపురం మెడికల్ :
వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు.. నియామకాల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోందా? ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా 24 మందిని తొలగించి.. వారి స్థానంలో కొత్తగా 24 మందిని విధుల్లోకి తీసుకున్న క్రమంలో కొన్నాళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడనుందా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అయితే ‘రచ్చ’ మాత్రం తప్పదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 156 ఎంపీహెచ్ఏ పోస్టుల నియామకాలకు 2003లో నోటిఫికేషన్ ఇచ్చారు. 152 పోస్టులు భర్తీ చేశారు. పదో తరగతి అర్హత ఉన్న 44 మందిని అప్పట్లోనే తొలగించి ఇంటర్ విద్యార్హతతో తీసుకున్నారు. అదే సమయంలో తొలగించిన 44 మందిని మళ్లీ తీసుకున్నారు. అప్పట్లో రూపొందించిన మెరిట్ లిస్ట్‌లో తమకు అన్యాయం జరిగిందని కొందరు కోర్టుకెళ్లగా.. గత ఏడాది సానుకూల తీర్పు వచ్చింది. అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను ఇక్కడి అధికారులు బేఖాతర్ చేశారు. పద్నాలుగేళ్లుగా పని చేస్తున్న 24 మందిని తొలగించి గత ఏడాది డిసెంబర్ 13ఽన కొత్తగా 24 మందికి రాత్రికి రాత్రే పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేశారు. కనీసం కౌన్సెలింగ్ కూడా చేయలేదు. ఈ క్రమంలో మెరిట్ ఉన్నా కొందరికి అన్యాయం జరిగింది. బీసీ–ఈ కేటగిరీ కింద ఇద్దరికి చోటు కల్పించడం వివాదాస్పదమైంది. కార్యాలయంలో పని చేసే ముగ్గురు అధికారులు ‘చేతివాటం’ చూపి పోస్టింగ్‌లలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో కలెక్టర్ కోన శశిధర్ స్పందించారు. నియామకాలకు సంబంధించిన ఫైల్‌ను రీరైట్ చేసి తీసుకురావాలని ఆదేశించడంతో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఈ ప్రక్రియను ముగించారు. ఈ నెల 8న కలెక్టర్‌కు నోట్‌ఫైల్ పెట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరిన 24 మంది పోస్టింగ్ ఆర్డర్లు రద్దు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై సోమవారం ఈ–మెయిల్ ద్వారా సదరు అభ్యర్థులు పని చేస్తున్న పీహెచ్‌సీలకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నెల 10న (నేడు) డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని పేర్కొన్నారు. ఎంపీహెచ్ఏలను రిలీవ్ చేయాలని ఆదేశాలు రావడంతో మెడికల్ ఆఫీసర్లు అందరినీ రిలీవ్ చేశారు.
‘బీసీ–ఈ’పై తెగని పంచాయితీ
2003లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేపట్టాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. 2003 నాటికి బీసీ–ఈ రిజర్వేషన్ లేకపోయినా ఇప్పుడు పోస్టులు దక్కించుకున్న వారిలో ఇద్దరు ఆ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. తాజాగా రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెబుతుండడంతో ఈ జాబితాలో బీసీ–ఈలను తొలగిస్తారా, లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు సిద్ధం!
రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో విధుల నుంచి తొలగించబడిన 24 మంది అభ్యర్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సోమవారం విజయవాడలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అరుణకుమారిని కలిసిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరారు. రీ పోస్టింగ్ ఇస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో ‘కొత్త వ్యూహం’ తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ‘పోస్టింగ్ ఆర్డర్లు’ రద్దయిన దృష్ట్యా కౌన్సెలింగ్‌ను అడ్డుకుని తిరిగి విధుల్లో చేరేలా ప్రణాళిక రచిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన వారు మళ్లీ విధుల్లో చేరిపోతే.. కొత్తగా చేరి పోస్టింగ్ ఆర్డర్లు రద్దయిన వాళ్ల గురించి మళ్లీ ఆలోచించవచ్చన్న ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు రానున్నట్లు తెలిసింది.