మిషన్.. సాగుతోంది!
నెమ్మదిగా మిషన్ కాకతీయ పనులు
మొదటి దశలోనే 27 చెరువులు అసంపూర్తి
రెండో దశలో 348 మాత్రమే పూర్తి
మూడో దశ చెరువుల ఎంపికపై అస్పష్టత
వరంగల్ : చిన్న నీటివనరుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పనులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆశించిన రీతిలో సాగడంలేదు. రెండేళ్ల క్రితం చేపట్టిన మొదటి దశ పనులే ఇంకా పూర్తి కావడం లేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 5839 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలో 3,55,187 ఎకరాల ఆయకట్టు ఉంది. 5839 చెరువులను ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించారు. ప్రతి ఏటా 20 శాతం చొప్పున ఐదేళ్లలో అన్ని చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మిషన్ కాకతీయ మొదటి దశ కింద 2015లో 1059 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి ఏటా 20 శాతం చొప్పున చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఈ ఏడాది నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలతో అన్ని చెరువుల్లోనూ నీళ్లు ఉన్నాయి. దీంతో మిషన్ కాకతీయ పనులు చేపట్టే పరిస్థితి లేదు. మొదటి రెండు దశల్లో చేపట్టిన పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి.
మొదటి దశలో 1059 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అన్ని చెరువుల పనులు మొదలయ్యాయి. అందులో 1032 చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇంకా 27 చెరువుల పనులు పెండింగ్లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన మొదటి దశ పనులు ఇప్పటికీ కొన్ని చెరువుల్లో పూర్తి కాలేదు. రెండో దశలో అభివృద్ధి చేసేందుకు సాగునీటి శాఖ అధికారులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1248 చెరువులను గుర్తించారు. అందులో 1085 చెరువులను మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సాగునీటి శాఖ అధికారులు 1075 చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. 1074 చెరువుల పనుల చేసేందుకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికి 323 చెరువుల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.