President approved
-
ఏపీ హైకోర్టు జడ్జిల నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదముద్ర వేశారు. అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడుగురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్ న్యాయమూర్తులు కాగా, బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలు అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ ఏడుగురూ రెండు మూడు రోజుల్లో న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుతుంది. -
ఎంసీఐ స్థానంలో ఇక పాలక మండలి
న్యూఢిల్లీ: అవినీతిలో కూరుకుపోయిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ–మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ని రద్దు చేసి, దాని బాధ్యతలను పరిపాలక మండలికి అప్పగిస్తూ కేంద్రం బుధవారం ఆర్డినెన్స్ జారీచేసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఎంసీఐని రద్దు చేసి దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు ఆమోదించేంత వరకు ఎంసీఐ అధికారాలన్నీ ఈ పరిపాలక మండలి వద్ద ఉంటాయి. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండటం తెలిసిందే. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎయిమ్స్–ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, పీజీఐఎంఈఆర్–చండీగఢ్ డైరెక్టర్ జగత్ రామ్, నిమ్హాన్స్–బెంగళూరు డెరెక్టర్ గంగాధర్, నిఖిల్ టాండన్(ఢిల్లీ ఎయిమ్స్)లు పరిపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. -
హోదాపై విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. త్వరలోనే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధనలో విజయ సాయిరెడ్డి పార్టీ తరఫున అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. -
లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నతస్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించిన లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో లోక్‌పాల్ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లును పార్లమెంటు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆమోదించింది. ప్రధానమంత్రిని సైతం ఈ బిల్లు పరిధిలోకి తెస్తూ డిసెంబర్ 18న పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అంతకుమించి ఈ బిల్లు కోసం ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన బలమైన ఉద్యమం మరువలేనిది. ఉన్నతస్థాయి అవినీతికి చెక్ పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని 1960 ల్లోనే కేంద్రంలో పెద్దలు భావించారు. తొలిసారి జన్‌లోక్‌పాల్ బిల్లును 1968లో శాంతిభూషణ్ ప్రతిపాదించారు. దీనిని 1969లో 4వ లోక్‌సభలో ఆమోదించారు. కానీ అప్పుడది రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008లలో లోక్‌పాల్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ అన్నాహజారే 2011 ఏప్రిల్‌లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో సూచనలు చేసేందుకు అన్నాహజారే సహా పలువురు ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో హజారే 98 గంటల తర్వాత ఏప్రిల్ 11న దీక్ష విరమించారు. 2011 డిసెంబర్ 27న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ఇది బలహీనంగా ఉందని, అందులో తాను కోరిన మార్పులు చేపట్టలేదని హజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2013 డిసెంబర్లో ఆయన మళ్లీ దీక్షకు దిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 17న రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ చేపట్టారు. అందులో పలు సవరణలు చేసి ఆమోదించారు. ఆ సవరణలకు హజారే సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 18న బిల్లును మళ్లీ లోక్‌సభకు పంపించి, సవరణలతో సహా ఆమోదించారు. దీంతో లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. ఈరోజు రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టమైంది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. వీరిపై వచ్చే ఫిర్యాదులను లోక్‌పాల్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. తాను పంపిన కేసుల్లో సీబీఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తుంది. లోక్‌పాల్ తరహాలోనే రాష్ట్రాల్లో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయాలని, ఇందుకు ఏడాది గడువు ఉంటుందని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. ఎవరిపైనైనా తప్పుడు ఆరోపణలు చేస్తే జరిమానా, జైలు శిక్షలు కూడా ఉంటాయి.