పూలు నింగిలో!
శంషాబాద్ రూరల్: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో పూల ధరలకు రెక్కలొచ్చాయి. బుధవారం నగరంలోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో వీటి ధరలు నింగినంటాయి. వారం క్రితం కిలో రూ.20 పలికిన బంతిపూల ధర ప్రస్తుతం రూ.100కు చేరింది. బతుకమ్మలను అలంకరించడానికి ఎక్కువగా బంతి, చామంతి (తెల్ల, పసుపు), గులాబీలను విరివిగా వినియోగిస్తుంటారు. వీటితో పాటు సాధారణంగా తంగేడు, గునుగు పూలను బతుకమ్మకు వాడుతుంటారు.
ఈ ఏడాది వీటి కొరత ఏర్పడింది. ఈసారి బతుకమ్మ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహస్తుండడంతో ప్రతి చోటా భారీ సంఖ్యలో బతుకమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. పోటాపోటీగా బతుకమ్మలను అలంకరిస్తుండడంతో పూలకు డిమాండ్ పెరిగింది. దసరా సీజన్లో స్థానికంగా పండించిన బంతి పూలు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. కానీ ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో స్థానికంగా పూల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది.
దీంతో వ్యాపారులు మహారాష్ట్ర, బెంగళూరు ప్రాంతాల నుంచి బంతితో పాటు చామంతి పూలను ఇక్కడి మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా పూల దిగుబడి తగ్గడం, బతుకమ్మలకు పూల వినియోగం పెరగడంతో డిమాండ్ ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్లో హోల్‌సెల్‌గా కిలో రూ.100 పలి కిన బంతి రిటైల్‌గా రూ.200 నుంచి రూ.250 వరకు అమ్ముడయ్యాయి. ఉద యం బంతి కిలో రూ.50 పలకగా మధ్యాహ్నం తర్వాత రూ.100కు చేరింది.
ఇంత ఎక్కువగా ధరలు పెట్టి బతుకమ్మలకు పూలను కొనలేక సామా న్య, మధ్య తరగతి కుటుంబాల మహిళలు నిరాశకు గురవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలను పెద్దఎత్తున నిర్వహిస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా పూలకు మంచి ధరలు పలకడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పూల ధరలు..
బంతి (కిలో) రూ.50 నుంచి 100
చామంతి (పసుపు) రూ.200 నుంచి 300
చామంతి (తెలుపు) రూ.150
గులాబీ రూ.150