అనుమతులకు బ్రేక్!
- నగరంలో ఆగిన నిర్మాణాలు
- కమిషన్ నివేదికతో తదుపరి చర్యలు
- మౌళివాకం ప్రమాదం ఎఫెక్ట్
సాక్షి, చెన్నై: మౌళివాకంలో ప్రైమ్ సృష్టి సంస్థకు చెందిన బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 61 మంది విగత జీవులయ్యారు. ఈ ఘటన అటు అధికారులను, ఇటు నిర్మాణ రంగంలో ఉన్న వారిని కలవరంలో పడే సింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన సీఎండీఏ వర్గాలను వీడటం లేదు. ఆ భవన నిర్మాణంలోని నాణ్యత లోపం కుప్పకూలడానికి ప్రధాన కారణంగా తేలడంతో అధికారులకు ముచ్చెమటలు పెడుతున్నారు.
అలాగే, ఏదేని సంఘటన జరిగినప్పుడే స్పందిస్తామన్నట్టుగా ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యత మీద దృష్టి పెట్టే పనిలో అధికారులు పడ్డారు. ఇప్పటి వరకు 400 భవనాలను పరిశీలించారు. కొన్నింటికి నోటీసులు జారీ అయ్యాయి. మరికొన్ని భవనాల నిర్మాణాలను నిలిపేశారు. మరో 300 భవనాలను పరిశీలించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మౌళివాకం ఘటనపై విచారణ వేగవంతం కావడం రిటైర్డ్ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలోని కమిషన్ నివేదిక సిద్ధం చేయడానికి సిద్ధమవుతుండడంతో సీఎండీఏ వర్గాలు కలవరంలో పడ్డాయి.
అనుమతులకు బ్రేక్: ప్రత్యేక కమిషన్ నివేదిక తమ మెడకు చుట్టుకునేలా ఉన్న పక్షంలో ఇరకాటంలో పడుతామన్న బెంగ సీఎండీఏ వర్గాల్ని వెంటాడుతోంది. దీంతో ఆ నివేదిక వచ్చే వరకు అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చారు. నెల రోజులుగా కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో అనుమతి దరఖాస్తుల జాబితా రోజురోజుకూ పెరిగి పోతోంది. ఇప్పుడు అనుమతుల్ని మంజూరు చేస్తే, ఏదేని సవరణలు, నిబంధనల్లో మార్పు చేయాల్సిన అవసరం వచ్చిన పక్షంలో తదుపరి భవన యజమానుల వద్దకు అధికారులు పరుగులు తీయాల్సి ఉంటుందని, అందుకే అనుమతులు ఇవ్వడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు.
ప్రత్యేక కమిషన్ తన నివేదికలో తప్పనిసరిగా కొత్త సూచనలు సలహాలు ఇవ్వడం ఖాయమని, అలాగే, ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉందన్నారు. ఇది వరకు ఇచ్చిన అనుమతుల మేరకు అడ్డగోలుగా నిర్మించిన భవనాల్ని క్రమబద్ధీకరించేందుకే తలలు పట్టుకోవాల్సి వస్తోందని మరో అధికారి పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయం ఉత్తర్వులు అమల్లోకి వచ్చే వరకు భవన యజమానులకు పడిగాపులు తప్పవని ఆ అధికారి స్పష్టం చేశారు.
ఆగిన నిర్మాణాలు: నగర శివారుల్లో కొన్ని బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలు ఓ వైపు అనుమతులకు దరఖాస్తులు చేసుకుని, మరో వైపు నిర్మాణ పనులు చేపట్టాయి. తాజాగా, అనుమతుల మంజూరుకు బ్రేక్ పడటంతో ఉన్న ఫలంగా నిర్మాణాలు ఆపుకోవాల్సిన పరి స్థితి. అనుమతులు దక్కుతాయన్న ధీమాతో నిర్మాణాలు చేపట్టిన అనేక సంస్థలు, ఇప్పుడు వెనక్కు తగ్గక తప్పడం లేదు. పునాదుల దశలో అనేక భవనాల నిర్మాణాలు నెల రోజులుగా ఆగి ఉన్నాయి. దీంతో కూలీలు పనులు లేక గగ్గోలు పెట్టాల్సి వస్తోంది.
రోజు వారీ వేతనాల మీద ఆధార పడిన కూలీలు, పనులు లేని దృష్ట్యా, కొందరు స్వగ్రామాల బాట పడుతుం టే, మరి కొందరు ప్రత్యామ్నాయ పనుల మీద దృష్టి పెట్టారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు మరెందరో సీఎండీఏను ఆశ్రయించారు. ఈ బహుళ అంతస్తుల అడ్డగోలు నిర్మాణాల పుణ్యమా అని, తమ ఇళ్ల నిర్మాణాలకు సైతం అనుమతులు మంజూరు కాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎండీఏ అనుమతులు వచ్చే నాటికి స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగిన పక్షంలో తమ మీద భారం తప్పదంటూ సొంత ఇంటి కల సాకారం చేసుకునే పనిలో ఉన్న మధ్య తరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.