వీవీఐపీ సిఫారసు చికిత్సలు ఇక బంద్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్రభుత్వ ఆసుపత్రి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో వీవీఐపీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పేద రోగుల చికిత్సకు ప్రాధాన్యం ఇస్తూ వీవీఐపీ సిఫారసు చేసే 'ప్రాధాన్య చికిత్స'లకు చరమగీతం పాడింది. అవసరం ప్రాతిపదికనే వైద్యులు రోగులకు సేవలు అందించాలని మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఆదేశాలిచ్చింది.
రోగులకు చికిత్స అందించే క్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మెడికల్ సూపరింటెండెంట్ చేసే సిఫారసులను పరిగణనలోకి తీసుకోరాదని, వాటికి ప్రాధాన్యత ఇవ్వొద్దంటూ ఆసుపత్రి యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆస్పత్రి వర్గాలు, సీనియర్ వైద్యులు, రోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి పరిపాలన విభాగం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందని, ఇకమీదట ఆసుపత్రి పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని ఓ సీనియర్ వైద్యుడు చెప్పారు.
కాగా ఇటీవలి ఆసుపత్రి యాజమాన్య నిర్ణయంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. ఆసుపత్రి యాజమాన్య ఆదేశాలపై విచారణ చేపడతామన్నారు. ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి తాజా నిర్ణయం.
అయితే ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీవీఐపీ సంస్కృతిని విడిచిపెట్టాలనే ఆకాంక్షను ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల తరచు వ్యక్తం చేస్తోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ ఆయా ఆసుపత్రులలోని స్పెషల్ వార్డులను జనరల్ వార్డులుగా మార్చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.