ఆంధ్రా అధికారి వేధింపులు ?
ఆదిలాబాద్ క్రైం : జిల్లా జైలులో ఓ ఆంధ్రా అధికారి గార్డింగ్ సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్‌ను తీవ్రంగా వేధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన పెత్తనమే సాగాలని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఈ వేధింపులు తీవ్రం కావడంతో జైలు గార్డింగ్ సిబ్బంది, సదరు అధికారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
దసరా సమయంలో సెలవు అడిగేందుకు వెళ్తే కించపరిచే విధంగా దూషించాడనే ఆరోపణలున్నాయి. ఖైదీలతో సదరు అధికారి ఇంటి పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ రోజు ఓ ఖైదీని ఇంటికి తీసుకెళ్లి వారితో వెట్టి చాకిరీ చేయించుకుని తిరిగి జైలుకు పంపిస్తున్నారనే తెలిసింది. జెలు అవసరాల కోసం దాతలు, ప్రభుత్వం ఇచ్చిన గృహోపకరణ వస్తువులను క్వార్టర్స్‌కు తీసుకెళ్లి ఉపయోగించుకుంటున్నారని సమాచారం. రిఫ్రిజిరేటర్, పడకలు, ఇతర వస్తువులను ఇంట్లో వినియోగించుకుంటున్నట్లు సమాచారం.
జైళ్ల శాఖ డీఐజీకి ఫిర్యాదుకు సిద్ధం..
తమను ఓ అధికారి వేధిస్తున్నారంటూ జైల్ గార్డింగ్ సిబ్బంది జైళ్ల శాఖ డీఐజీని కలిసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటికే జైల్లో పనిచేస్తున్న 17మంది గార్డింగ్ సిబ్బంది మూకుమ్మడిగా ఫిర్యాదు చేసేందుకు సంతకాలతో కూడిన వినపత్రాన్ని అందజేయనున్నారు. శనివారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లినప్పటికీ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా జైళ్ల శాఖ డీఐజీని కలిసి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.