జీవితమంతా కటకటాల్లో...
వీక్షణం
ఈ కుక్క బోనులో ఉందని అనుకుంటున్నారా? కాదు... జైల్లో ఉంది. ఓ చిన్న పిల్లాడిని కరిచి, దారుణంగా గాయపర్చి నందుకుగాను దానికి యావజ్జీవిత ఖైదును విధించింది అమెరికన్ కోర్టు. యావజ్జీవిత శిక్ష అంటే మనలాగా పద్నాలుగేళ్లు కాదు... జీవితమంతా జైల్లోనే ఉండాలి.
ఈ ఖైదీ కుక్క పేరు మిక్కీ. నిజానికిది ఎప్పుడూ కుదురుగానే ఉండేది. కానీ హఠాత్తుగా ఏమయ్యిందో ఏమో... ఓ చిన్నపిల్లాడిని కరిచేసింది. మిక్కీ యజమానురాలు బేబీ సిట్టింగ్ చేస్తుంది. ఆమె దగ్గరకు వచ్చే పిల్లల్లో నాలుగేళ్ల కెవిన్ విన్సెంట్ ఒకడు. ఓ రోజు ఎప్పటిలానే కెవిన్ని తీసుకొచ్చి క్రష్లో వదిలి వెళ్లారు తల్లిదండ్రులు.
ఆరోజు మిక్కీకి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు గానీ... కెవిన్ని ఇష్టమొచ్చినట్టు కరిచేసింది. కంటికి, దవడకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో కెవిన్ తల్లిదండ్రులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి... కుక్కల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ‘నో కిల్లింగ్ షెల్టర్’లో జీవితాంతం బందీగా ఉంచమని తీర్పునివ్వడంతో కటకటాల వెనక్కి వెళ్లిపోయింది మిక్కీ.
కేసు మొదలైన తరువాత మిక్కీని వదిలేయమంటూ జంతు సంరక్షకులు కొందరు గొడవ చేశారు. నోరు లేని ప్రాణి తెలియక చేసిన తప్పుకు మరణశిక్ష వేయవద్దంటూ కోర్టును అభ్యర్థించారు. దాంతో న్యాయమూర్తి మిక్కీని జీవితమంతా జైల్లో ఉండమన్నారు. లేదంటే మరణశిక్ష వేసేవారట. అదీ సంగతి!