private buses seize
-
ఆర్టీఏ దాడులు, ఆరు ప్రైవేట్ బస్సులు సీజ్
మహబూబ్‌నగర్‌లో జిల్లాలోని పాలెం దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణాశాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని షాపూర్ ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఆరు బస్సులను ఆర్టీఏ అధికారులు మంగళవారం ఉదయం సీజ్ చేశారు. టూరిస్ట్ కారియర్లుగా పర్మిట్ తీసుకుని స్టేజ్ కారియర్లుగా తిప్పుతున్నారని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. దాంతో ఆ బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారులు వివరించారు. అలాగే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆర్టీఏ అధికారులు నిర్వహించిన దాడుల్లో నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్‌ను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. గత నెలలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. దాంతో ఆర్టీఏ ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడ ఝుళిపించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దాదాపు వెయ్యి బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది. -
రవాణా శాఖ తనిఖీలు, 47 బస్సులు జప్తు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ దాడులు రెండోరోజు కూడా కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 47 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, రంగారెడ్డి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముమ్మరంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జాతీయ రహదారిపై వెళ్లే బస్సులను ఆపి ఫిట్నెస్ పరిశీలించారు. డ్రైవర్ల ఫిట్నెస్ను కూడా తనిఖీ చేశారు. కొన్ని బస్సులు పర్మిట్ కూడా లేకుండా తిరుగుతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడైంది. గుంటూరులో కంకరగుంట, బస్టాండ్ వద్ద తనిఖీలు జరిపిన అధికారులు పది బస్సులను జప్తు చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఓ బస్సును సీజ్ చేశారు. కర్నూలులో నాలుగు, జహీరాబాద్లోనూ నాలుగు బస్సులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.