'ఐ' సినిమా నిర్మాతకు కష్టాలు
టీనగర్: బ్యాంకులో 97 కోట్ల బకాయిలు ఉన్న చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆస్తులను సదరు బ్యాంకు జప్తు చేసింది. ప్రముఖ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్. ఈయన కమల్‌హాసన్ నటించిన దశావతారం, విక్రమ్ నటించిన అన్నియన్, ఐ వంటి పలు చిత్రాలను నిర్మించారు. చిత్రాల నిర్మాణం కోసం చెన్నైలోగల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఆస్తులను తాకట్టు పెట్టి రుణం పొందినట్లు సమాచారం. ఈ మొత్తం వడ్డీతో కలిసి రూ.97 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
నిర్ణీత గడువులోగా రుణాన్ని చెల్లించనందున ఆస్కార్ రవిచంద్రన్ ఆస్తులను జప్తు చేసేందుకు బ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థకు సొంతమైన భవనాలు, ఇళ్లు, థియేటర్లు సహా ఐవోబీ జప్తు చేసింది. దీనిగురించి ఆస్కార్ ఫిలింస్ సంస్థ తరపున ఈవిధంగా తెలియజేయబడింది. రుణం చెల్లించేందుకు తగిన గడువు కోరామని, దీని గురించి బ్యాంకు అధికారులకు లేఖ రాశామన్నారు. అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. త్వరలో రుణాన్ని చెల్లించడం జరుగుతుందన్నారు.