50 కోట్ల డాలర్లకు స్నాప్డీల్ అమ్మకాలు !
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 50 కోట్ల డాలర్లకు చేరువ అవుతాయని దేశీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, స్నాప్డీల్ తెలిపింది. ఈ -కామర్స్ సెగ్మెంట్ జోరు కారణంగా 2015 మార్చి కల్లా తమ అమ్మకాలు వంద కోట్ల డాలర్లకు పెరుగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపిస్తోందని స్నాప్డీల్డాట్కామ్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) టోనీ నవీన్ చెప్పారు. వినియోగదారులు ఇప్పుడు మరింత నమ్మకంగా ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని, ఫలితంగా తమ అమ్మకాలు 4-5 రెట్ల వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు.
అన్ని కేటగిరి వస్తువులు బాగా అమ్ముడవుతున్నాయని, అయితే ఎలక్ట్రానిక్స్, దుస్తుల అమ్మకాలు మరింత జోరుగా ఉన్నాయని వివరించారు. 2010, ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభించామని దాదాపు 2 కోట్ల మంది సభ్యులయ్యారని పేర్కొన్నారు. దాదాపు 500 రకాల కేటగిరిల్లో 20 వేల మంది విక్రయదారులు ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నారని, 4,000 నగరాల్లో డెలివరీలు ఇస్తున్నామని వివరించారు. రెండేళ్లలో అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.