వైద్య ప్రొఫెసర్లకు హార్వర్డ్‌లో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న 100 మంది వైద్య ప్రొఫెసర్లకు బోస్టన్‌కు చెందిన ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వైద్యవిద్యలో వస్తున్న మార్పులు, అధునాత న వైద్యచికిత్స పద్ధతులపై శిక్షణ ఇచ్చేటట్లు గత ఫిబ్రవరిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశలో వందమంది ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్యవిద్య సంచాలకులకు లేఖ రాసింది. ప్రొఫెసర్ల జాబితా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్లకు కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన విధించిన ట్లు తెలిపారు.