ప్రొఫెసర్ దురుసు ప్రవర్తన
విశాఖపట్నం: తనకు సంబంధించిన బిల్లు తయారు చేయలేదనే కారణంతో ఓ ప్రొఫెసర్... నాన్ టీచింగ్ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో నాన్ టీచింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని ఆంధ్రా యునివర్శిటీ (ఏయూ) దూర విద్యా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...యూనివర్శిటీలో పని చేస్తున్న ప్రొ.రాజకుమార్ వ్యక్తిగత బిల్లు తయారు చేయాలని నాన్ టీచింగ్ ఉద్యోగి నర్సింహరావును కోరారు. బిల్లు తయారు చేయడంలో నర్సింహరావు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ విషయంపై మంగళవారం నర్సింహరావును ప్రొ.రాజకుమార్ నిలదీశారు.
అయితే అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ప్రొ.రాజ్‌కుమార్... నర్సింహరావు పట్ల దురుసుగా ప్రవర్తించి, కొట్టినంత పని చేశారు. దీంతో ఆగ్రహించిన నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలిసి యూనివర్శిటీ టీచింగ్ స్టాఫ్ కూడా ఆందోళనకు దిగారు. దీంతో ఓ వర్గంపై మరో వర్గం వారు పోటాపోటీగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దూర విద్యాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ప్రొ. రాజ్‌కుమార్ వెంటనే సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం.