చిన్నారులకు ‘కంగారు మదర్ కేర్’ వరం
నల్లగొండ టౌన్ : నవజాత శిశువులకు కంగారు మదర్ కేర్ వరం లాంటిదని కేర్ చీఫ్ కో ఆర్టినేటర్, ప్రొఫెసర్ శశివాణి అన్నారు. కంగారు మదర్ కేర్‌పై జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో గురువారం నిర్వహించిన మొదటి జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. నవజాత శిశువులు నెలల నిండకుండా పుట్టినప్పుడు వారికి కంగారు మదర్ కేర్ అవసరమన్నారు. ఈ విధానంలో భాగంగా ఎదపె పడుకోబెడతారని.. తల్లిగర్భంలో పొందే వెచ్చదనాన్ని శిశువులు అక్కడ పొందుతారని వివరించారు.
అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని వైద్య బృందం సందర్శించింది. కంగారు మదర్ కేర్ విధానంపై యూనిట్ నోడల్ అధికారి డాక్టర్ దామెర యాదయ్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం శశివాణి మాట్లాడుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలు దేశంలోనే అదర్శవంతంగా ఉన్నాయన్నారు. కంగారు మదర్‌కేర్ విధానాన్ని అమలు చేస్తున్న తీరు చాలా సంతృప్తినిస్తోందన్నారు. వైద్యులందరూ ఈ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు.
శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు వైద్యులు సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఈ నెల 26న రెండో రోజు సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో డాక్టర్ ప్రొఫెసర్ దీపాబ్యాంకర్, డాక్టర్ పరగ్‌దగ్లి, డాక్టర్ నతాళిచర్పక్, ప్రొఫెసర్ అర్సర్, ప్రొఫెసర్ సుష్మనంగియా, డాక్టర్ సిమ్రాని, డాక్టర్ జులేతా, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ జి. శ్రీకాంత్‌రెడ్డి, కె. ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ జిలా ని, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసంతకుమారితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు.