profit crop
-
బొప్పాయి పాలు.. రైతుకు లాభాలు
సాధారణంగా బొప్పాయి తోటలు అనగానే బొప్పాయి కాయలే గుర్తుకు వస్తాయి. అయితే అందులో మరో కోణం దాగి ఉంది. బొప్పాయి కాయలు తినడానికే కాకుండా బొప్పాయి పాలు, ఆకులు మందుల తయారీలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం నైపుణ్యం కలిగిన కూలీలు తోటల వద్దనే మకాం వేసి మరీ పాలసేకరణ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నేరుగా తోటల వద్దకే వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు. బొప్పాయి పాల కోసం ఎకరం తోటకు రూ. 20వేలు, బొప్పాయి ఆకు కోసం ఎకరం తోటకు రూ.15వేలు కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు పాలసేకరణ బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం 6 గంటల నుంచి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. ఆ తరువాత కూలీలకు ఎలాంటి పని ఉండదు. జిల్లాలోని రైల్వేకోడూరు నుంచి ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను తీసుకొస్తున్నారు. కూలీలు బొప్పాయి తోటల్లోనే గుడిసెలు వేసుకొని పాలసేకరణ పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉంటారు. కూలీలందరూ ఉదయం ఆరు గంటల నుంచి పదిగంటల వరకు పాలసేకరణ చేస్తారు. ఎకరానికి ఎనిమిది క్యాన్ల పాలసేకరణ ఎకరం బొప్పాయి తోటలో కూలీలు ఎనిమిది క్యాన్ల వరకు పాలసేకరణ చేస్తారు. ఒక్కో కూలీ కనీసం రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తారు. ఒక క్యాన్ పాలు సేకరిస్తే కూలీలకు కాంట్రాక్టర్ రూ. 1500 చెల్లిస్తారు. కనీసం పది మంది కూలీలు గుంపులు, గుంపులుగా బొప్పాయి తోటల్లో మకాం వేసి పాలు సేకరిస్తుంటారు. ప్రత్యేక పద్ధతుల్లో పాలసేకరణ బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో సేకరిస్తుంటారు. ముళ్ల కంప లాంటి వస్తువుతో ముందుగా బొప్పాయి కాయలపై గాట్లు వేస్తారు. అనంతరం బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసిన ఓ జల్లెడలాంటి అట్టను కింద ఉంచుతారు. బొప్పాయి కాయల్లో నుంచి కారే పాలన్నీ కింద ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో పడతాయి. పాలు కింద పడిన కొద్దిసేపటికే అవి గడ్డగా మారిపోతాయి. పా«లధార నిలిచిపోయిన తరువాత గడ్డగా మారిన పాలను ప్లాస్టిక్ క్యాన్లలో నింపుతారు. సాధారణ, ఆయుర్వేద మందుల తయారీలో వినియోగం ఇక్కడి బొప్పాయి తోటల్లో సేకరించిన పాలను క్యాన్ల ద్వారా కాంట్రాక్టర్లు రైల్వే కోడూరులోని ఫ్యాక్టరీలకు చేరుస్తారు. అక్కడి నుంచి ఈ బొప్పాయి పాలను ట్యాంకర్ల ద్వారా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తారు. సాధారణ అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేద మందుల తయారీలో ఈపాలను వినియోగిస్తుండడంతో వీటికి మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎకరం తోట రూ.20వేలు పాలసేకరణ కోసం కాంట్రాక్టర్లు ఎకరం బొప్పాయి తోటలకు రూ. 20 వేలు వరకు చెల్లిస్తుంటారు. పాలసేకరణ పూర్తి అయిన తరువాత బొప్పాయి ఆకు ను కూడా కత్తిరించి టన్ను రూ. 15 వేలు చొప్పున విక్రయిస్తుంటారు. బొప్పాయి పాలతో పాటు ఆకు కూడా మందుల తయారీలో వినియోగిస్తుంటా రు. దీంతో పాలతో పాటు ఆకుకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఆకు, పాలసేకరణ ముగిసిన తరువాత తోటల్లో మిగిలిన కాయల్ని ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. బొప్పాయి పచ్చికాయల నుంచి స్వీట్లు, బ్రెడ్లు, కేక్‌ల తయారీలో వినియోగించే స్వీట్ చిప్స్‌ను తయారు చేస్తారు. మందుల తయారీలో పాలను వాడతారు బొప్పాయి పాలను మందులు తయారు చేసే ప్రక్రియలో భాగంగా వాడతారు. బొప్పాయి పాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తీసుకెళుతుంటారు. మేము బొప్పాయి తోటలను కాంట్రాక్ట్ తీసుకొని పాలను సేకరిస్తాము. బొప్పాయి పాలతో పాటు ఆకు కుడా మందుల తయారీలో వినియోగిస్తారు. చివరగా మిగిలిన కాయలు స్వీట్ చిప్స్ తయారీకి వాడతారు. సిద్ధార్థ, కాంట్రాక్టర్, రైల్వేకోడూరు రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తాం బొప్పాయి తోటల్లో రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తాము. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు మాత్రమే పాలసేకరణకు అనుకూల సమయం. ఒక క్యాన్‌కు కాంట్రాక్టర్ రూ. 1500 ఇస్తాడు. పదిమంది ఒక బృందంగా ఏర్పడి బొప్పాయి తోటల్లోనే గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండిపోతాం. 15 రోజుల వరకు ఒక తోటలో పాలసేకరణ చేస్తాము. శీను, రైల్వేకోడూరు -
సేంద్రియ లాభాల కో(క్కొరో)కో!
‘సాగు గిట్టుబాటు కావడం లేదు. పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. దీర్ఘకాలిక పంటే అయినా సాగు చేస్తూ నష్టాలు చవిచూడలేము. దీనికన్నా కోకో తోటలను తొలగించుకోవడమే మేలు’ ఇది కోనసీమలో రసాయనిక వ్యవసాయం చేసే కోకో రైతుల ఆవేదన. అయితే, సేంద్రియ పద్ధతులు పాటించే రైతులు ఖర్చులు భారీగా తగ్గించుకొని లాభాల బాటలో సాగుతున్నారు. కొబ్బరి సాగులో కోకో ప్రధాన అంతర పంట. కొబ్బరితోపాటు ఆయిల్ పామ్ తోటల్లో సైతం దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వేలాది ఎకరాల్లో కోకో సాగు జరుగుతున్నది. ఇటీవల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం కోకో సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంది. కొబ్బరి సంక్షోభ సమయంలో రైతులను ఆదుకున్నది కోకో పంటే. కోకో ఆదాయంపైనే కొబ్బరి రైతులు ఆధారపడిన సందర్భాలూ లేకపోలేదు. అటువంటిది పెట్టుబడులు పెరగటం, పెట్టుబడులకు తగిన ఆదాయం రాక కోనసీమలో పలువురు రైతులు కోకో తోటలను తొలగిస్తున్నారు. గడిచిన ఒకటి, రెండు నెలల్లో పలువురు రైతులు అరటి తోటల్లో కోకో చెట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. ఇందుకు వారు చెప్పే కారణాలివి.. ఇటీవల కాలంలో పెట్టుబడులు పెరగడం, తగిన దిగుబడి రాకపోవడం, కోకో గింజలకు కనీస ధర రాకపోవడం. సేంద్రియ సాగు పద్ధతే శ్రేయోదాయకం ఇటువంటి సమయంలో పెట్టుబడులు తగ్గించుకునేందుకు సేంద్రియ సాగు విధానం మేలు అని ఉద్యానశాఖాధికారులు, శాస్త్రవత్తేలు, ఈ విధానంలో సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో భూసారం పెంచుకునేందుకు జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్, పంచగవ్య వంటి ద్రవరూప ఎరువులను వినియోగించడం, డ్రిప్ వాడకంతో పెట్టుబడులు మూడొంతులు తగ్గుతున్నాయని సేంద్రియ రైతులు చెబుతున్నారు. రూ. 13 వేలకు తగ్గిన పెట్టుబడి రసాయన పద్ధతుల్లో సాగు చేసే రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.70 వేల వరకు ఖర్చవుతుండగా, సేంద్రియ విధానంలో సాగు చేస్తే రూ.13 వేలు ఖర్చవుతుండటం విశేషం. పెట్టుబడులు తగ్గించుకోవడం ద్వారా సేంద్రియ రైతులు ఎకరాకు రూ.43,540 వరకు లాభాలు పొందుతుంటే.. రసాయన, సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు ఎకరాకు రూ. 6,150 మేరకు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. తక్కువ ఖర్చు, లాభసాటి ధర సేంద్రియ సాగు వల్ల రసాయనిక సేద్యం కన్నా ఏ విధంగా చూసినా మేలే. తొలి రెండేళ్లు సెమీ ఆర్గానిక్ అంటే 60:40, 40:60 పద్ధతుల్లో సాగు చేశాను. గడచిన రెండేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాను. దీని వల్ల స్వల్పంగా దిగుబడి తగ్గినా.. పెట్టుబడులు సగానికి పైగా తగ్గాయి. డ్రిప్ వల్ల కూలీల ఖర్చును కూడా బాగా తగ్గించగలిగాను. సేంద్రియ విధానంలో సాగు చేస్తేనే లాభసాటి ధర వస్తోంది. – వంకాయల స్వామిప్రకాష్ (98663 55165), ఆదర్శ రైతు, ఇమ్మిడివరప్పాడు, అమలాపురం, తూ.గో. జిల్లా సేంద్రియ విధానంలో డ్రిప్ పెట్టిన కోకోతోట – ఎన్. సతీష్, సాక్షి, అమలాపురం -
ప్రధాన వాణిజ్య పంట
అనంతపురం అగ్రికల్చర్ : ఇటీవల దానిమ్మ తోటలు జిల్లాలో ప్రధాన వాణిజ్యపంటగా రైతులను ఆర్థికంగా గట్టెక్కిస్తున్నాయని ఉద్యానశాఖ టెక్నికల్ హెచ్‌వో జి.చంద్రశేఖర్ తెలిపారు. అయితే కొందరు సకాలంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడంతో నష్టపోతున్నారు. ప్రధానంగా తోటలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే తెగుళ్లు, రోగాలను అంత దూరం చేసుకోవచ్చని తెలిపారు. దానిమ్మకు అనుకూలం.. భూభౌగోళిక నైసర్గిక పరంగా జిల్లాలో అన్ని రకాల నేలలు దానిమ్మ తోటలకు అనుకూలం. గణేష్, మదుల, భగువ రకాలు ఎంచుకోవాలి. నాటే సమయంలో 20 కిలోల పశువుల ఎరువు, కిలో సూపర్ ఫాస్ఫేట్, 2 శాతం లిండేన్ పొడిని మట్టితో కలిపి గుంతలు నింపాలి. గాలి అంట్లు, నేల అంట్లు లేదా కొమ్మల ప్రవర్ధనం ద్వారా వచ్చిన మొక్కలను నాటుకోవాలి. 50–70 రోజుల్లో అంట్లు వేర్లు నాటేందుకు అనుకూలం. చెట్టు వయస్సును బట్టి పశువుల ఎరువు, వేపపిండి, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వాడాలి. సూక్ష్మధాతు లోపాల సవరణ.. జింకు లోపం ఏర్పడితే ఆకుల పరిమాణం చిన్నదిగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. లీటరు నీటికి 5 గ్రాముల జింకు సల్ఫేటును కలిపి 1–2 సార్లు కొత్త చిగురు ఉన్నప్పుడు పిచికారి చేయాలి. పెర్రస్(ఇనుము) ధాతువు లోపించిన ఆకులు తెల్లబడతాయి. నివారణకు 2.5 గ్రాముల పెర్రస్ సల్ఫేట్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్నా... బోరాన్ లోపించనపుడు లేత కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. నివారణకు 12.5 గ్రాముల బోరాక్సును పాదులకు వేయాలి. లేదా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్సును కలిపి పిచికారి చేయాలి. ప్రతి మొక్కకు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను కాండాలుగా ఉంచి మిగిలినవి కత్తిరించాలి. నేలకు తగిలే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు, నీటి కొమ్మలను కత్తిరించాలి. డ్రిప్ ద్వారా నీటి సదుపాయం క్రమపద్ధతిలో ఇవ్వాలి. కాయతొలిచే పురుగు, బెరడు తినే పురుగులు, తామరపురుగులు, పేనుబంక నివారణ చర్యలు చేపట్టాలి. మచ్చ తెగులు ప్రమాదకరం: బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే మచ్చతెగులు 27 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 70 శాతం పైగా గాలిలో తేమశాతం ఉండే జూలై నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా కనిపిస్తుంది. వేసవిలో కురిసే వర్షాల వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితులు కూడా ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన చెట్లకు అంట్లు కట్టుట వలన నర్సీరీ దశలోనే వ్యాప్తి చెందుతుంది. ఆకులపైన, కొమ్మలపైన, పిందెలపైన నీటిలో తడిచిన మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు అధికమై ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు రాలిపోవడం, కొమ్మలు కణుపుల వద్ద విరిగిపోవడం, కాయలపై మచ్చలు నలుపు రంగులోకి మారి వాటిపై ‘వై’ లేదా ఎల్’ ఆకారపు నెరియలు ఏర్పడుతాయి. మొదట్లోనే రోగరహిత మొక్కలు నాటుకోవాలి. తెగులు ఆశించిన కొమ్మల భాగాలను అంగుళం కింది వరకు కత్తిరించి కాల్చి వేయాలి. కత్తిరింపు సమయంలో వాడే కత్తెరలను ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టి ఉపయోగించాలి. వీటి కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలి. కత్తిరింపులు అయిన వెంటనే ఒక శాతం బోర్డో మిశ్రమమును పిచికారి చేసుకోవాలి.