సాధారణంగా బొప్పాయి తోటలు అనగానే బొప్పాయి కాయలే గుర్తుకు వస్తాయి. అయితే అందులో మరో కోణం దాగి ఉంది. బొప్పాయి కాయలు తినడానికే కాకుండా బొప్పాయి పాలు, ఆకులు మందుల తయారీలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం నైపుణ్యం కలిగిన కూలీలు తోటల వద్దనే మకాం వేసి మరీ పాలసేకరణ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నేరుగా తోటల వద్దకే వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు. బొప్పాయి పాల కోసం ఎకరం తోటకు రూ. 20వేలు, బొప్పాయి ఆకు కోసం ఎకరం తోటకు రూ.15వేలు కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు.
ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు పాలసేకరణ
బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం 6 గంటల నుంచి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. ఆ తరువాత కూలీలకు ఎలాంటి పని ఉండదు. జిల్లాలోని రైల్వేకోడూరు నుంచి ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను తీసుకొస్తున్నారు. కూలీలు బొప్పాయి తోటల్లోనే గుడిసెలు వేసుకొని పాలసేకరణ పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉంటారు. కూలీలందరూ ఉదయం ఆరు గంటల నుంచి పదిగంటల వరకు పాలసేకరణ చేస్తారు.
ఎకరానికి ఎనిమిది క్యాన్ల పాలసేకరణ
ఎకరం బొప్పాయి తోటలో కూలీలు ఎనిమిది క్యాన్ల వరకు పాలసేకరణ చేస్తారు. ఒక్కో కూలీ కనీసం రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తారు. ఒక క్యాన్ పాలు సేకరిస్తే కూలీలకు కాంట్రాక్టర్ రూ. 1500 చెల్లిస్తారు. కనీసం పది మంది కూలీలు గుంపులు, గుంపులుగా బొప్పాయి తోటల్లో మకాం వేసి పాలు సేకరిస్తుంటారు.
ప్రత్యేక పద్ధతుల్లో పాలసేకరణ
బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో సేకరిస్తుంటారు. ముళ్ల కంప లాంటి వస్తువుతో ముందుగా బొప్పాయి కాయలపై గాట్లు వేస్తారు. అనంతరం బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసిన ఓ జల్లెడలాంటి అట్టను కింద ఉంచుతారు. బొప్పాయి కాయల్లో నుంచి కారే పాలన్నీ కింద ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో పడతాయి. పాలు కింద పడిన కొద్దిసేపటికే అవి గడ్డగా మారిపోతాయి. పా«లధార నిలిచిపోయిన తరువాత గడ్డగా మారిన పాలను ప్లాస్టిక్ క్యాన్లలో నింపుతారు.
సాధారణ, ఆయుర్వేద మందుల తయారీలో వినియోగం
ఇక్కడి బొప్పాయి తోటల్లో సేకరించిన పాలను క్యాన్ల ద్వారా కాంట్రాక్టర్లు రైల్వే కోడూరులోని ఫ్యాక్టరీలకు చేరుస్తారు. అక్కడి నుంచి ఈ బొప్పాయి పాలను ట్యాంకర్ల ద్వారా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తారు. సాధారణ అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేద మందుల తయారీలో ఈపాలను వినియోగిస్తుండడంతో వీటికి మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఎకరం తోట రూ.20వేలు
పాలసేకరణ కోసం కాంట్రాక్టర్లు ఎకరం బొప్పాయి తోటలకు రూ. 20 వేలు వరకు చెల్లిస్తుంటారు. పాలసేకరణ పూర్తి అయిన తరువాత బొప్పాయి ఆకు ను కూడా కత్తిరించి టన్ను రూ. 15 వేలు చొప్పున విక్రయిస్తుంటారు. బొప్పాయి పాలతో పాటు ఆకు కూడా మందుల తయారీలో వినియోగిస్తుంటా రు. దీంతో పాలతో పాటు ఆకుకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఆకు, పాలసేకరణ ముగిసిన తరువాత తోటల్లో మిగిలిన కాయల్ని ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. బొప్పాయి పచ్చికాయల నుంచి స్వీట్లు, బ్రెడ్లు, కేక్‌ల తయారీలో వినియోగించే స్వీట్ చిప్స్‌ను తయారు చేస్తారు.
మందుల తయారీలో పాలను వాడతారు
బొప్పాయి పాలను మందులు తయారు చేసే ప్రక్రియలో భాగంగా వాడతారు. బొప్పాయి పాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తీసుకెళుతుంటారు. మేము బొప్పాయి తోటలను కాంట్రాక్ట్ తీసుకొని పాలను సేకరిస్తాము. బొప్పాయి పాలతో పాటు ఆకు కుడా మందుల తయారీలో వినియోగిస్తారు. చివరగా మిగిలిన కాయలు స్వీట్ చిప్స్ తయారీకి వాడతారు.
సిద్ధార్థ, కాంట్రాక్టర్, రైల్వేకోడూరు
రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తాం
బొప్పాయి తోటల్లో రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తాము. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు మాత్రమే పాలసేకరణకు అనుకూల సమయం. ఒక క్యాన్‌కు కాంట్రాక్టర్ రూ. 1500 ఇస్తాడు. పదిమంది ఒక బృందంగా ఏర్పడి బొప్పాయి తోటల్లోనే గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండిపోతాం. 15 రోజుల వరకు ఒక తోటలో పాలసేకరణ చేస్తాము.
శీను, రైల్వేకోడూరు
Comments
Please login to add a commentAdd a comment