మంచితనాన్ని వాడేసుకుంటే ఎలా?
జీవన గమనం
నేనో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. నాకు జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఆచార వ్యవహారాలన్నీ మా చెల్లెలు, బావగారి చేత చేయించాను. దుర దృష్టవశాత్తూ కొద్ది రోజుల తర్వాత మా బావ గారు ఓ ప్రమాదంలో చనిపోయారు. అందుకు కారణం నా పెళ్లి బాధ్యతలు తీసుకోవడమేనని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. అల్పజ్ఞానులు అనుకుందామంటే అమ్మాయి తండ్రి విద్యుత్ సంస్థలో మంచి స్థాయిలో ఉన్నవారు. ఇప్పుడు నేనేం చేయాలో సలహా ఇవ్వండి.
- కృష్ణ, వికారాబాద్
ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉన్నాడా, కింద స్థాయిలో ఉన్నాడా అన్నది కాదు చర్చ. మానసిక స్థాయి, హేతుదృష్టి (రేషనలిజం), పరిస్థితిని అర్థం చేసుకునే విధానం మొదలైనవన్నీ ఉద్యోగం మీద ఆధారపడి ఉండవు. ఆ సంగతి పక్కన పెడదాం. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... రేపు వాళ్ల ఇంట్లో ఏ అనర్థం జరిగినా, దానికి మిమ్మల్నే కారణ భూతుల్ని చేస్తారు.
అంత దేబిరించుకుని వివాహం చేసుకోవలసిన అవసరం మీకుందా? లేదా నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ అమ్మాయి మీకు బాగా నచ్చి, మరొకరిని వివాహం చేసుకోవడానికి మీ మనసు అంగీకరించపోతుంటే... ఆమెతో డెరైక్ట్‌గా మాట్లాడండి. తల్లిదండ్రుల్ని ఎదిరించి వచ్చి వివాహం చేసుకునే ధైర్యం ఆమెకు ఉంటే, ఆపై ఏం చేయాలా అని మీరు ఆలోచించుకోండి.
ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. మీరన్నట్టు వాళ్లు అల్ప జనులే. మూర్ఖుల మనసు రంజింపజాలము అన్నాడో ప్రముఖ కవి. కాబట్టి అలాంటివారికి దూరంగా ఉండటమే మంచిది.
నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు చదువు మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. మరేదైనా చేయాలని పిస్తోందా అంటే అదీ లేదు. నా లక్ష్యం ఏమిటో, అసలు నాకు దేనిమీద ఆసక్తి ఉందో కూడా అర్థం కావడం లేదు. నా మెదడు ఎందుకిలా తెల్ల కాగితంలా తయారయ్యిందో తెలియడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా?
- అంకిత్, చెన్నై
మనం చేస్తున్న పని మీద ఉత్సాహం లేనప్పుడు మెదడు తెల్ల కాగితంలానే తయారవు తుంది. చదువు మీద శ్రద్ధ లేకపోవడం తప్పు కాదు కానీ ఏ గమ్యం లేక పోవడం తప్పు. ప్రతి మనిషిలోనూ మరో మనిషి నిద్రిస్తూ ఉంటాడు. అతడిని నిద్ర లేపాలి. అతడికి ఇష్టమైన పనేదో తెలుసు కుని, దాన్ని హాబీగా పెట్టుకుంటే అప్పుడు గమ్యంవైపు ఆనందంగా వెళ్లవచ్చు. మీలో ఏ కళ ఉన్నదో ఒక నిర్ణయానికి రండి. దాని సాధన ప్రారంభించండి. జీవితం బాగుండటానికి అదే మొదటి మెట్టు.
నేనో మధ్య తరగతి వ్యక్తిని. బంధాలకు విలువిస్తాను. బాధ్యతలను ఇష్టంగా మోస్తాను. అలా అని నా మంచితనాన్ని అందరూ అడ్వాంటేజ్‌గా తీసుకుంటే తట్టుకోలేకపోతు న్నాను. బంధువులంతా ఎప్పుడూ ఏదో ఒక సహాయం అడుగుతూనే ఉంటారు. పనుల్లో సహాయమైతే ఫర్వాలేదు. కానీ ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి. అలా అని చెప్పినా విని పించుకోరు. నువ్వయితే కాదనవనే నీ దగ్గరకు వచ్చాం అంటూ ఇబ్బంది పెట్టేస్తుం టారు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి.
- రంగనాయకులు, నెల్లూరు
భయం తర్వాత మనిషికి అత్యంత ప్రమాదకరమైన జబ్బు మొహమాటం. ఒకమ్మాయి క్లాస్మేట్స్ చాలామందికి వేసవి సెలవుల్లో పెళ్లిళ్లయ్యాయి. శుభలేఖ ఇచ్చిన ప్రతి ఫ్రెండ్ పెళ్లికీ ఆమె వెళ్లింది. కొన్ని నిశ్చితార్థాలకి కూడా అటెండ్ అవ డంతో చదువులో వెనకబడింది. గ్రాడ్యు యేషన్లో మంచి మార్కులతో పాసయినా సివిల్స్ ప్రిలిమ్స్‌లో దారుణంగా ఫెయిలైంది.
ఇటువంటి సందర్భాల్లో ‘నో’ చెప్ప లేని బలహీనత, ఎవరేమనుకుంటారో అన్న మొహమాటం, ఆత్మ న్యూనత, ఐడెంటిటీ క్రైసిస్ మిళితమై ఉంటాయి.
ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం కన్నా... కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని ‘మొహమాటం’ అంటారు. కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం కంటే, ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దాన్ని ‘దాతృత్వం’ అంటారు. అవతలివారు మనతో ఎలావుంటే మనకి బావుంటుందో మనం చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? ఇతరులకి ‘నో’ చెప్పడం మనల్ని వారికి దూరం చేయవచ్చు.
కానీ ‘ఎస్’ చెప్పడం మనల్ని మనకి దూరం చేస్తుంది. ఇతరుల కోరికలకీ మన ఇబ్బందులకీ మధ్య సరైన గీత గీసుకోగలిగితే మానవ సంబంధాలు బావుంటాయి. ఈ ప్రశ్న మీ పేరు మీదే పంపించారో, మరో పేరు పెట్టారో తెలియదు. మీ పేరు రంగనాయకులై, మీరు నెల్లూరు నుంచే రాసి ఉంటే కనుక ఈ పత్రిక కాపీని జిరాక్స్ తీయించి మీ బంధువులందరికీ పంపించండి చాలు.
- యండమూరి వీరేంద్రనాథ్