మద్య రహిత భారతే ‘ఆప్’ ధ్యేయం
తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో‘బ్యాన్ లిక్కర్’ క్యాంపెయిన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ ధ్యేయమని ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక మండలి సభ్యుడు యోగేందర్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పార్టీ జాతీయ మేనిఫెస్టోలో కూడా పెట్టామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘బ్యాన్ లిక్కర్’ ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా యోగేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు తాగునీరు దొరకడం లేదు కానీ, మద్యం మాత్రం విరివిగా లభ్యమవుతోందన్నారు. మం దిర్, మసీదులకు 100 మీటర్ల దూరం వరకు మద్యం దుకాణం ఉండకూడదన్న నిబంధనను కూడా పాటించడం లేదని ఆరోపించారు.
కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతోనే నడుస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హర్యానా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆమ్ఆద్మీ సంపూర్ణ మద్యం నిషేధ ఉద్యమాన్ని చేపట్టిందన్నారు. మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి కలిగిన పార్టీ ఆప్ మాత్రమేనని చెప్పారు. ఉద్యమాన్ని రాజకీయ అంశంగా కాకుండా సామాజిక బాధ్యతగా ముం దుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు, యువతను భాగస్వాములను చేయడం ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. క్యాంపెయిన్‌లో భాగంగా ‘అన్సర్టెన్ లైఫ్’ లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. బ్యాన్ లిక్కర్ ఉద్యమ పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు, ఆప్-తెలంగాణ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి పి.ఎల్.విశ్వేశ్వరరావు, ముఖ్య నేతలు నమత్రాజైశ్వాల్, ఛాయరతన్, ఫజీదుద్దీన్, మధు సూదనరావు, అనితారావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ విస్తరణకు ‘మిషన్ విస్తార్’
అంతకుముందు జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో యోగేందర్ యాదవ్ మాట్లాడారు. ‘మిషన్ విస్తార్’ పేరిట తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అడ్హాక్ కమిటీతో పాటు జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసి బూత్ స్థాయిలో పార్టీని విస్తరించాలని సూచించారు. ఢిల్లీలో ఎన్నికలు జరిగితే సొంతంగా మెజార్టీ సాధించే సత్తా ఆప్‌కు ఉందన్నారు. ఢిల్లీ ఎన్నికలయ్యాక మిగిలిన రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి పెడతామని యోగేందర్ యాదవ్ పేర్కొన్నారు.