కృష్ణా నుంచి తాగునీరు విడుదల
త్వరలో సాగునీటి విడుదలకు ఏర్పాట్లు: మంత్రి దేవినేని
విజయపురి సౌత్: ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను దశలవారీగా పూర్తి చేస్తామని నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బుధవారం నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 11.20 గంటలకు స్విచ్ ఆన్ చేయగా గంటకు 500 క్యూ సెక్కుల చొప్పున పెంచుతూ సాయంత్రానికి 6,000 క్యూసెక్కు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల అనంతరం మంత్రి రివర్ వ్యూ అతిథి గృహంలో మాట్లాడారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండటం వల్ల తాగునీటి కోసం నీటిని విడుదల చేశామన్నారు. కృష్ణా డెల్టాకు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని.. గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రాయలసీమకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు.