AP: ఆయకట్టులో ఆనందహేల
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులు ప్రవాహ జలాలతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ ఏడాది కూడా భారీగా వరద ప్రవాహం చేరుతుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా వరద జలాలను ఒడిసి పట్టి ప్రాజెక్టులు, చెరువులను నింపడం ద్వారా వాటి పరిధిలోని ఆయకట్టు మొత్తానికి సాగు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు చివరి భూములకు సైతం నీరందించేందుకు జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31 వరకు) ప్రారంభమైన రెండు నెలల్లోనే ముందెన్నడూ లేని రీతిలో ప్రాజెక్టుల్లోకి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం చేరింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల తదితర ప్రాజెక్టుల్లో పూర్తి నీటి నిల్వ 601.13 టీఎంసీలకు గాను 495.95 టీఎంసీలు, పెన్నా బేసిన్‌లోని సోమశిల, కండలేరు, గండికోట, సీబీఆర్ తదితర ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ 261.58 టీఎంసీలకు గాను 154.48 టీఎంసీలు మేర ఇప్పటికే నిల్వలు చేరాయి. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ 12.56 టీఎంసీలకు గాను 7.38 టీఎంసీలు, వంశధార, నాగావళి, ఏలేరు తదితర బేసిన్లలో ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ 107.08కు గాను 43.57 టీఎంసీలు ఇప్పటికే చేరాయి.
అంటే.. మొత్తం అన్ని బేసిన్లలో ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ 982.35 టీఎంసీలకు గాను ఇప్పటికే 701.37 టీఎంసీలు చేరాయి. గతేడాది ఇదే సమయానికి కేవలం 431.75 టీఎంసీలు నిల్వ ఉండేవి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకూ నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల ఈ నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత రెండేళ్ల తరహాలోనే ఈ ఏడాది కూడా నీటి లభ్యత అధికంగా ఉంటుందని నీటి పారుదలరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయిలో నీటి సరఫరా
రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21 నీటి సంవత్సరాలలో ఖరీఫ్, రబీ కలిపి కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు ప్రభుత్వం నీళ్లందించి రికార్డు సృష్టించింది. వరుసగా మూడో ఏడాది కూడా రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఖరీఫ్ పంటల సాగుకు గోదావరి, కృష్ణా డెల్టాలతోపాటు వంశధార, తోటపల్లి, కేసీ కెనాల్, ఎల్లెల్సీ(తుంగభద్ర దిగువ కాలువ) ఆయకట్టుకు నీటిని విడుద చేసింది. పుష్కర, చాగల్నాడు, వెంకట నగరం, తొర్రిగడ్డ, తాడిపూడి తదితర ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది.
భూపతిపాలెం, ముసురుమిల్లి వంటి చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టుకూ ఇప్పటికే నీటిని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) 975 ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. దాంతో ఆయకట్టులో రైతులు ఆనందోత్సాహాల మధ్య పంటల సాగులో నిమగ్నమయ్యారు. సోమవారం తెలుగు గంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ, పెన్నా డెల్టా ఆయకట్టుకూ నీళ్లందించేందుకు కసరత్తు చేస్తోంది.
శివారూ భూములకూ అందేలా..
వర్షాలు పడక ముందే భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద ప్రధాన కాలువలు, బ్రాంచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలలో జల వనరుల శాఖ అధికారులు రూ.104.21 కోట్లతో మరమ్మతులు చేయించారు. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటిని సరఫరా చేసి వృథాకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఆయకట్టు శివారు భూములకూ నీళ్లందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సమృద్ధిగా నీటిని సరఫరా చేయడం ద్వారా పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి సరఫరా
గత రెండేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ నదులు వరద ప్రవాహంతో ఉరకలెత్తుతున్నాయి. ప్రాజెక్టులు నిండుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు వరద నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులు, చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాం. ఈ ఏడాది కూడా యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా చర్యలు చేపట్టాం. నీటిపారుదల సలహా మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నాం.
– సి.నారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్, జల వనరుల శాఖ